కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23 : గుర్తింపు సంఘాన్ని పిలవకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీశారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు యూనియన్ సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. మంగళవారం శేషగిరి భవన్లో జి.వీరస్వామి అధ్యక్షతన జరిగిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ నెల 20న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాద్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, అధ్యక్షుడు వి.సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్ కుమార్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సింగరేణి కార్మికులకు లాభాల వాటా, తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మాట్లాడగా డిప్యూటీ సీఎం, సింగరేణి యాజమాన్యంతో కలిసి లాభాల వాటా గురించి మాట్లాడుకోమన్నారని, అయితే మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవడం బాధాకరం అన్నారు.
పీఎల్ఆర్ఎస్ నిర్ణయం కోసం నిన్న జరగాల్సిన స్టాండర్డై జేషన్ కమిటీ సమావేశం ఐఎన్టీయూసీ అంతర్గత తగాదాలతో కోర్టుకు వెళ్లి కమిటీ సమావేశం జరగకుండా చేశారని, అలాగే 11వ వేజ్ బోర్డు కాలంలో కూడా కోర్టుకు వెళ్లి జాప్యం చేసి, చివరి రోజున కలవడం జరిగిందని, ఇలా ఐఎన్టీయూసీ వారు కార్మికులకు మంచి చేస్తున్నారా లేక చెడు చేస్తున్నారా కార్మికులు ఆలోచించాలని వారు సూచించారు. ఓన్ యువర్ ఓన్ హౌస్ స్కీమ్ విషయంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కృషి ఫలితంగా 2009లో యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ను కోల్ ఇండియాలో మాదిరిగా కంపెనీయే భరించాల్సి ఉండగా, రూ.91 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతూ నేటి వరకు యాజమాన్యం స్పందించడం లేదన్నారు. కనీసం ప్రస్తుతం కంపెనీ ఆర్జించిన లాభాల నుండి అట్టి ట్యాక్స్ ను కార్మికులకు చెల్లించకుండా రూ.4,035 కోట్లను ప్రక్కన పెట్టిందని వారు ఆరోపించారు. మెడికల్ అన్ ఫిట్ అయినా/చనిపోయిన కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ఇవ్వకుండా 240 మంది మెడికల్ ఫిట్ అయినప్పటికి విటిసి కి పంపకుండా ఆపడం సహించరాని విషయం అన్నారు. యాజమాన్యం కార్పోరేట్ మెడికల్ బోర్డు నిర్వహించకుండా సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని, కార్పొరేట్ మెడికల్ బోర్డును విధిగా నిర్వహించి కార్మికులకు న్యాయం చేయాలని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
గత ఏడాది సంస్థ అభివృద్ధి కోసం లాభాల నుండి తీసి పక్కకు పెట్టిన రూ.2,289 కోట్లను దేని కోసం ఖర్చు చేశారో నేటివరకు తెలుపలేదని, తిరిగి ఈ సంవత్సరం 34 శాతం లాభాల్లో వాటా ప్రకటనకు ముందు పక్కకు పెట్టిన రూ.4,034 కోట్లను దేని కోసం ఖర్చుపెడతారో వివరాలను తెలుపకుండా కనీసం గుర్తింపు సంఘంతో చర్చించకుండా లాభాల్లో వాటా ప్రకటన చేయించడం సరైన విధానం కాదని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిరసన వ్యక్తం చేస్తుందని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 మాత్రమే చెల్లించడం ధారుణమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి, ఎస్.వి.రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వట్టికొండ మల్లికార్జున రావు, కె.రాములు, ఎస్.నాగేశ్వర్ రావు, ఎస్.రాము, ఎస్. శ్రీనివాస్, హుమాయూన్, గోపికృష్ణ, బండారు మల్లయ్య, మాచర్ల శ్రీను, రవీందర్ పాల్గొన్నారు.