హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టేముందు సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది. శనివారం అసోసియేషన్ ప్రతినిధులు డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) నరేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి మాట్లాడుతూ.. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్(డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ వైద్యుల సరెండర్, విలీన ప్రక్రియ పూర్తయితే మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా అవకాశం దక్కుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ చేపట్టకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తే వైద్యులు తమ సీనియారిటీని కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు.
కొత్త పీజీ మెడికల్ కోర్సులకు దరఖాస్తులు
కొత్త పీజీ మెడికల్ కోర్సులు, పీజీ కోర్సుల్లో సీట్ల పెంపునకు కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఈ నెల 2 నుంచి 31 వరకు గడువు విధించినట్టు పేర్కొన్నది. రిజిస్ట్రేషన్‌కు నాన్ రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరింది. నకిలీ సమాచారం ఇచ్చిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.