Pradeep Rawat | భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు, హిందీ, తమిళ సినీ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985లో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. సినిమాల్లోకి రాకముందు పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా బి.ఆర్. చోప్రా రూపొందించిన ప్రముఖ టీవీ సీరియల్ మహాభారత్ లో అశ్వత్థామ పాత్ర పోషించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించారు.
తర్వాత బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం భయంకరమైన విలన్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘ఓయ్’, ‘పూలరంగడు’, ‘నేను శైలజ’, ‘సరైనోడు’, ‘వాల్తేర్ వీరయ్య’ వంటి చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో కూడా ప్రేక్షకులను అలరించారు. విలనిజం, హాస్యం రెండింటినీ సమానంగా పండించగల అరుదైన నటుడిగా గుర్తింపు పొందారు. ప్రదీప్ రావత్ సినీ జీవితం గురించి చాలా మందికి తెలిసినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం పెద్దగా వెలుగులోకి రాలేదు. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయన వెల్లడించిన ప్రకారం, తన భార్య కల్యాణి తెలుగు కుటుంబానికి చెందినవారు. దీంతో ప్రదీప్ రావత్ తెలుగింటి అమ్మాయిని వివాహం చేసుకున్న నటుడిగా కూడా గుర్తింపు పొందారు.
సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆయన కుటుంబం ఎప్పుడూ లో-ప్రొఫైల్‌నే కొనసాగించింది. అందువల్ల ఆయన భార్య, పిల్లలు చాలా అరుదుగా మాత్రమే ప్రజల ముందుకు వచ్చేవారు. ప్రదీప్ రావత్, కల్యాణి దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమాల్లో క్రూరమైన విలన్‌గా కనిపించే ప్రదీప్ రావత్, నిజ జీవితంలో మాత్రం ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తి అని ఆయన భార్య గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అని, కుటుంబంతో గడపడం ఎంతో ఇష్టపడేవారని కల్యాణి ఒక సందర్భంలో వెల్లడించారు. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన ప్రదీప్ రావత్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.