Savarkar Objected To Cow Worship | రాహుల్ గాంధీపై పుణె కోర్టులో జరుగుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో మంగళవారం కీలక వాంగ్మూలం అందించారు. ఆవును దేవుడిగా లేదా గోమాతగా పూజించడం మానవత్వానికే కాకుండా దైవత్వ భావనకే అవమానమని, దానిని కేవలం ఒక ఉపయోగకరమైన జంతువుగా మాత్రమే చూడాలని సావర్కర్ తన పుస్తకంలో స్పష్టంగా రాసినట్లు ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్లో తన తాతపై వివాదాస్పదా వ్యాఖ్యలు చేశారంటూ సత్యకి దాఖలు చేసిన పరువు నష్టం దావా విచారణ సందర్భంగా ఈ విషయాలు బయటకొచ్చాయి.
ప్రత్యేక జడ్జి అమోల్ షెండే సమక్షంలో రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మిలింద్ పవార్.. సావర్కర్ రాసిన “విజ్ఞాన వినష్ట వినబంధ” అనే పుస్తకాన్ని కోర్టు ముందుంచగా.. ఈ పుస్తకాన్ని సావర్కరే స్వయంగా రాశారని, ఆవును పూజించే భావనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని సత్యకి అంగీకరించారు. ఆవు మనకు ఎంతగా ఉపయోగపడుతుందో కుక్క, గుర్రం, గాడిద వంటి ఇతర జంతువులు కూడా మానవునికి అంతే ఉపయోగకరమని, వాటిని ఎలాగైతే పూజించకుండా కేవలం రక్షిస్తామో.. ఆవును కూడా అలాగే కాపాడాలి తప్ప పూజించకూడదని సావర్కర్ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలిపారు.
అలాగే ఆవు శరీరంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారనే ప్రచారాన్ని సావర్కర్ తప్పుపట్టారు. ఇటువంటి నమ్మకాలు హిందూ సంస్కృతినే అపహాస్యం చేసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. హిందూ మతం పేరిట ఆవు పేడను తినడం, ఆవు మూత్రాన్ని సేవించడం వంటి ఆచారాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇవి మతపరమైన ఆచారాలు కాదని, కేవలం మూఢనమ్మకాలేనని తేల్చిచెప్పారు. గోవుకు దండ వేసే బదులు, నమ్మకమైన కుక్క మెడకు గంట లేదా కాలర్ కట్టినట్లుగా ఆవు మెడకు గంట కట్టాలని సావర్కర్ సూచించారని సత్యకి కోర్టుకు వివరించారు.
అమెరికాలో ఆవులను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో, కేవలం ఉపయోగకరమైన జంతువులుగా భావిస్తూ పశుసంపదను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని సావర్కర్ ప్రశంసించారు. కానీ భారత్లో మాత్రం ఆవును కేవలం పూజనీయ వస్తువుగా చూస్తూ, ఆచరణలో మాత్రం గోశాలలు, కసాయిఖానాలకే పరిమితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సత్యకి కోర్టులో స్పష్టం చేశారు.