Trisha | ఉదయనిధి స్టాలిన్ తాజా వ్యాఖ్యలు, వాటి చుట్టూ నెలకొన్న వివాదం, అరెస్టు, అనంతరం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలతో ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదే సమయంలో నటి త్రిష పేరు కూడా ఈ వ్యవహారంలో ప్రస్తావనకు రావడంతో, వీరిద్దరికి సంబంధించిన పాత వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉదయనిధి సినిమాలో నటించేందుకు త్రిష నిరాకరించారు , ₹12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు అనే ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. 2018లో దర్శకుడు కే.ఎస్. అధియమాన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ రొమాంటిక్-హారర్ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వచ్చాయి. ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, వారిలో ఒకరిగా త్రిషను ఎంపిక చేశారని పలువురు మీడియా సంస్థలు ప్రచురించాయి. అంతేకాకుండా ఆ సినిమాకు ‘ఏంజెల్’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు ప్రచారం జరిగింది.
అయితే, ఈ వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే చిత్ర బృందం స్పందించింది. త్రిష ఆ సినిమాలో నటించడం లేదని, ‘ఏంజెల్’ అనేది సినిమా టైటిల్ కూడా కాదని స్పష్టం చేసింది. దీంతో ఉదయనిధి-త్రిష కాంబోపై వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోయింది. ఇటీవల మరోసారి ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఓ చిత్రంలో నటించేందుకు త్రిషకు ₹12 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారని, అయితే ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినప్పటికీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్రిష, ఉదయనిధి స్టాలిన్ లేదా రెడ్ జెయింట్ మూవీస్ తరఫున ఈ వార్తను ఎవరూ ధృవీకరించలేదు. అనేక మీడియా సంస్థలు కూడా దీనిని కేవలం ‘రూమర్’, ‘స్పెక్యులేషన్’, ‘రిపోర్ట్స్ ప్రకారం’ అనే కోణంలోనే ప్రచురించాయి.
అందువల్ల, త్రిష నిజంగానే ₹12 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించారనే విషయాన్ని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుతం లేవు. త్రిషకు ఉదయనిధి స్టాలిన్ నిర్మాణ సంస్థతో ఎలాంటి అనుబంధం లేదనే ప్రచారం కూడా వాస్తవం కాదు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించిన ‘కురువి’ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించారు. అలాగే ‘మన్మథన్ అంబు’ సినిమాలో కమల్ హాసన్‌తో కలిసి కూడా ఆమె నటించారు. అంటే నిర్మాతగా ఉదయనిధి సంస్థతో త్రిషకు ఇప్పటికే మంచి అనుబంధం ఉంది. అయితే, ఉదయనిధి స్టాలిన్ హీరోగా, త్రిష హీరోయిన్గా మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న రెమ్యునరేషన్ వార్త మాత్రం నిర్ధారణ లేని ప్రచారంగానే మిగిలింది.