ఆర్కిటెక్ట్ అయిన నేను.. కొత్తగా కట్టబోయే అపార్టుమెంట్ డిజైన్ బ్లూప్రింట్ తయారు చేయడానికి సీరియస్‌గా పని చేసుకుంటున్నాను. ఫోన్ మోగడంతో విసుగ్గా చూశా! ‘అమ్మ’ అని కనిపించింది. వెంటనే ఫోన్ ఎత్తి.. “హలో!” అన్నా.
“సార్! అమ్మగారు ఉన్నట్టుండి గుండె దగ్గర చెయ్యి పెట్టుకుని ‘నొప్పి.. నొప్పి..’ అని బాధపడుతున్నారు. మీరు త్వరగా ఇంటికి రండి” చెప్పింది పనిమనిషి.“సరే! వెంటనే వస్తున్నాను” అని ఫోన్ పెట్టేసి, అంబులెన్సుకి ఫోన్ చేసా. ఈలోగా కారులో వేగంగా ఇంటికి చేరుకొన్నా. వెళ్లేసరికి అమ్మ నొప్పితో విలవిల్లాడుతోంది. గబగబా దగ్గరికి వెళ్లి.. “ఏమైందమ్మా?” అని అడిగాను. “గుండెల్లో నొప్పిగా ఉంది!” అంది ముద్దముద్దగా. ఆమెకు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. వెంటనే ఆమెను పనిమనిషి సహాయంతో ఏసీ గదిలోకి మార్చా. ఫ్యాన్ కూడా వేసి, ఆమెకు ధారాళంగా గాలి ఆడేలా చేసి, గ్లాసులో నీళ్లు తెచ్చి తాగించాను. ఆమె ఎక్కువ తాగలేక పోయింది. ఆమెకు పట్టిన చెమటల్ని నా కర్చీఫ్‌తో తుడుస్తూ.. సపర్యలు చేస్తూ పక్కనే కూర్చున్నాను.
ఈలోగా అంబులెన్సు రావడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లా. హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఐసీయూకి చేర్చారు. డాక్టర్ ఈసీజీ తీసి.. తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పి.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. వెంటనే బైపాస్ ఆపరేషన్ చెయ్యాలని కొంతడబ్బు డిపాజిట్ చెయ్యమని చెప్పారు. అలాగేనని కొంత డబ్బు కట్టి వచ్చాను. వాళ్లు ఆపరేషన్ చేసేలోపే.. అమ్మ చనిపోయింది. నా భార్య శ్రీలతకి ఫోన్ చేసి, విషయం చెప్పమని ఓ నర్స్‌కి చెప్పడంతో.. ఆమె చెప్పింది. హాస్పిటల్ వాళ్లు శవాన్ని తీసుకెళ్లమని చెప్పడంతో, మార్చురీ వ్యాన్ కోసం ఎదురుచూస్తున్నాను. శ్రీలత ఆఫీస్ నుంచి వస్తూ ఆరేళ్ల కొడుకు దేవాన్ష్‌ని స్కూల్ నుంచి తీసుకొచ్చింది. వాడు వస్తూనే.. “నాయనమ్మకు ఏమైంది నాన్నా!” అని అడిగాడు.
“హార్ట్.. అటాక్!” అన్నా ఏడుస్తూ. నా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. భుజం చుట్టూ చేతులేసి నన్ను హత్తుకున్నాడుసానుభూతిగా. “బాధ పడకండి!”.. భుజంపై చెయ్యి వేసి ఓదార్పుగా అంది నా భార్య.అమ్మ శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చాను. ఉదయం ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు.. ‘జాగ్రత్తగా వెళ్లు నాన్నా!’ అని చెప్పిన అమ్మ, సాయంత్రం ఇంటికి శవమై వచ్చింది. పక్కింటి వాళ్లు వస్తే, ఎవరెవరికి చెప్పాలో చెప్పి.. అందరికీ చెప్పమన్నాను. అమ్మ డైరీలో కొన్ని ఫోన్ నంబర్లున్నాయి. వాళ్లకు కూడా ఫోన్ చేసి, విషయం చెప్పించాను. అమ్మ శవాన్ని ఏసీ బాక్స్‌లో పెట్టించి.. ఇంటిముందు టెంట్ వేయించాను. ఆమె తల దగ్గరే కుర్చీ వేసుకు కూర్చున్నాను. ఆమె ముఖంవైపు చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంది.
‘ప్రశాంతమైన నిద్ర అంటే.. మరణమేనేమో!’ అని నాకు అనిపించింది. రాత్రి ఏడు గంటలైంది. నా ఆఫీస్ స్నేహితుడు ఉమేష్ వచ్చాడు. ఓ జోక్ చెప్పి నన్ను నవ్వించి, ఆ బాధలోంచి బయటపడేసే ప్రయత్నం చేశాడు. వాడి జోక్ విని నిర్లిప్తంగా నవ్వాను. ఆ నవ్వులో ఎటువంటి జీవం లేదు. లావాలా ఉబికి వస్తున్న దుఃఖం తప్ప. కొద్దిసేపు నాపక్కన కూర్చొని వెళ్లిపోయాడు. నా భార్య భోజనం చెయ్యమని చెప్పింది. తినాలనిపించలేదు. వద్దని చెప్పాను. అర్థం చేసుకుని వెళ్లిపోయింది. పది గంటలయ్యింది. ఒకతను వచ్చి అమ్మను కాసేపు చూసి.. “నీతో మాట్లాడాలి. కొంచెం పక్కకి వస్తావా!?” అన్నాడు.
‘ఎందుకు?’ అన్నట్టుగా చూసాను అతనివైపు.“చెప్తాను రా!” అన్నాడు అభ్యర్థనగా.డిసెంబర్ కావడంతో కాస్త చలిగా ఉంది. “చెప్పండి” అన్నాను అతనివైపు చూసి.“మీ అమ్మను నేను ప్రేమించాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం” అన్నాడు.అతనివైపు విచిత్రంగా, అనుమానంగా చూశాను. ఇదేంటి? నాకు చెప్తున్నాడు. అందులోనూ చనిపోయాక.. అన్న అనుమానం నా మనసులో మెదిలింది. “నావైపు అలా చూడకు. నేనెవరో, మీ అమ్మకు-నాకు ఎలా పరిచయమో చెప్తాను విను!” అంటూ తన గురించి చెప్పసాగాడు.
“నాపేరు యుగంధర్. మీ నాన్న, నేను మంచి స్నేహితులం. రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేసేవాళ్లం. విజయవాడ రైల్వేస్టేషన్లో మా ఆఫీస్ ఉండేది. రోజూ కలుసుకునేవాళ్లం. పనిలో ఒకరికొకరం సహాయం చేసుకునేవాళ్లం. అప్పుడప్పుడూ నేను నా భార్యతో మీ ఇంటికి, మీ అమ్మ, నాన్న మా ఇంటికీ వచ్చేవాళ్లు. ఆవిధంగానే మీ అమ్మకూ, నాకూ పరిచయం ఏర్పడింది. నువ్వు పుట్టిన మూడునెలలకి ఓ రైలు ప్రమాదంలో మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మ అప్పటికే టైపింగ్ హయ్యర్ గ్రేడ్ పూర్తిచేయడంతో.. మీ నాన్నగారికి బదులు ఆమెకి టికెట్ బుకింగ్ క్లర్క్‌గా ఉద్యోగం ఇచ్చారు. నా భార్యకు, నాకు మనస్పర్ధలు రావడంతో గొడవపడి విడిపోయాం.
ఇంతకుముందున్న పరిచయంతో కలిసినప్పుడల్లా మాట్లాడే వాడిని. అలా, మీ అమ్మమీద ఇష్టం ఏర్పడింది. ఓరోజు కలిసినప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగాను. ఆమె ఒప్పుకోలేదు. మా స్టేషన్ మాస్టర్ చేత కూడా చెప్పించాను ఆమె ససేమిరా అన్నది. ఇంటికెళ్లి సావధానంగా మాట్లాడదామని ఓరోజు మీ ఇంటికొచ్చా. ఇంట్లో నువ్వు, మీ అమ్మ తప్ప ఎవరూలేరు. నువ్వు పాక్కుంటూ ఆడుకుంటున్నావు. మీ అమ్మ వంటగదిలో అటు తిరిగి వంకాయలు కోస్తోంది. నేను సరాసరి వంటగదిలోకి వెళ్లి మీ అమ్మను పలకరించాను. అలా వెళ్లడంతో ఆమెకు నాపై బాగా కోపం వచ్చింది. ఒక్కసారిగా చేతిలోని కూరగాయలు కోసే కత్తితో నాపై విరుచుకుపడింది. ‘బయటికి వెళ్లు!’ అని పెద్దగా అరుస్తూ, చేతిలోని కత్తితో ఏటవాలుగా పైనుండి కిందికి తిప్పింది. ఆ కత్తి నా చెంపకు తగిలి చీరుకు పోయింది. ఇదే ఈ మచ్చ!” అని చెంపను చూపించాడు.
అతని చెంపపై కత్తి గీసుకుపోయిన మచ్చ కనిపించింది. అతను మళ్లీ చెప్పడం ప్రారంభించాడు.
“భయపడి బయటికి వచ్చేసాను. మీ అమ్మ అరుపులకు చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు వచ్చారు. ఇక అక్కడ ఉండలేక వెళ్లిపోయాను. ఆ తర్వాత రైల్వేస్టేషన్లో ఎక్కడైనా కనిపించినా, నేను పలకరించినా నాతో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరొచ్చి, రిటైర్ అయ్యి ఇక్కడే స్థిరపడ్డాను. ఏడాది క్రితం అనుకోకుండా ఓ ఫంక్షన్లో కలిసాం. నేను క్షమాపణ చెప్పి.. మీ అమ్మకు ఫోన్ నంబర్ ఇచ్చాను!” అని కాసేపు ఆగాడు.“మరి మా అమ్మకి మీమీద కోపం తగ్గిందా?”
అని అడిగాను.
“ఆ విషయం నాకు తెలియదు, క్షమాపణ అయితే చెప్పాను” అన్నాడు.‘మళ్లీ పెళ్లి గురించి మీరు మాట్లాడలేదా?!’ అని అడుగుదామనుకున్నాను. కానీ, హేళన చేసినట్టుగా ఉంటుందని ఊరుకున్నాను. మళ్లీ ఆయనే.. “సరే ఆలస్యమౌతుంది. వెళ్లి మళ్లీ రేపువస్తాను” అన్నాడు.అతను వెళ్లిపోగానే తిరిగి వచ్చి అమ్మ తలదగ్గరే ఉన్న అదే కుర్చీలో కూర్చున్నాను. పన్నెడు గంటల తర్వాత బాగా పొద్దు పోయింది. “అత్తయ్య దగ్గర నేను కూర్చుంటాను. మీరెళ్లి పడుకోండి”’ అంది నా భార్య వచ్చి.“లేదు నువ్వెళ్లి పడుకో!” అన్నాను.ఆమె వెళ్లిపోయింది. రేపటి నుంచి అమ్మ ఉండదనే ఊహే నాకు చాలా భయాన్ని, దిగమింగుకోలేని బాధనీ కలిగిస్తోంది. భార్య, కొడుకు, స్నేహితులు ఉన్నా.. ఈ ప్రపంచంలో ఒంటరినై, ఏకాకిగా మిగిలిపోయానని అనిపిస్తోంది. తెల్లవార్లూ అలాగే కూర్చున్నాను. కళ్లు ఎర్రబడ్డాయి నిద్రలేక. ప్రతి రాత్రీ వెళ్లిపోతూ వీడ్కోలుగా ఒక ఉదయాన్నిస్తుంది! ఆ ఉదయం కొంతమందికి సంతోషాన్ని, మరికొంత మందికి దుఃఖాన్ని తీసుకొస్తుంది. కానీ, ఈ ఉదయం మాత్రం నాకు అంతులేని విషాదాన్ని తీసుకొచ్చింది. తెల్లవారిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చారు అమ్మని చూడటానికి. ఎనిమిది గంటలైంది.ఒకామె వచ్చి నా పక్కనే కూర్చుంది. కాసేపు అమ్మవైపు తదేకంగా చూసి బాధపడింది. నావైపు తిరిగి.. అమ్మ, తనూ చిన్ననాటి స్నేహితులమని చెప్పింది. ఇద్దరిదీ ఒకేఊరట. కలిసి చదువుకున్నామనీ, చిన్నప్పుడు అమ్మ ఎంతో చలాకీగా, హుషారుగా ఉండేదనీ చెప్పింది. అమ్మ బాల్యంలో ఎంత సంతోషంగా గడిపిందో ఆమె మాటల్లోనే తెలిసిపోతోంది. ఇప్పటి పిల్లలకి అంత స్వేచ్ఛ, సంతోషం ఎక్కడున్నాయి? గాడిదల్లా పుస్తకాల బరువు మోస్తూ ర్యాంకుల కోసం కుస్తీ పడటం తప్ప. నా కొడుకుని చూస్తే జాలేసింది.“నేను వెళ్తాను బాబు. నాలుగు రోజులనుంచి జ్వరం. తప్పనిసరై మందులు వేసుకుని వచ్చాను” అంది.
“సరే!” అన్నాను. ఆమె వెళ్లిపోయింది. మధ్యాహ్నం తర్వాత ఖట్టిక తయారు చేశారు. అమ్మని సిద్ధం చేసుకుని, శ్మశానానికి తీసుకెళ్లడానికి.. ముందు నేను నిప్పుకుండతో, నా వెనక నలుగురు అమ్మని మోసుకొస్తూ.. వాళ్లవెనక మిగతావాళ్లంతా బయల్దేరాం. అమ్మ వెళ్లిపోవడం ఆకాశానికీ ఇష్టం లేనట్లుంది, సన్నగా ఏడుస్తోంది. కట్టెలు పేర్చి చితికి నిప్పంటించా! నాన్న చనిపోయిన తర్వాత నా కోసమే ఒంటరిగా బతికి, కష్టపడి పనిచేసి.. రూపాయి రూపాయి కూడబెట్టి.. నన్ను అమెరికా పంపించి మరీ చదివించి ఇంతవాణ్ని చేసి.. ఆ కట్టెల్లో ఓ కట్టెగా కాలిపోయింది. ఆమెతోపాటు ఆమె కష్టాలు, కన్నీళ్లు కూడా. అందరూ వెళ్లిపోయారు. కుండలో చితాభస్మం తీసుకుని బయలుదేరుతుండగా.. కొద్దిదూరంలో యుగంధర్ నిలబడి ఉన్నాడు.“ఎప్పుడొచ్చారు?” అని అడిగాను.“నీ వెనకే! జనంతోపాటే వచ్చాను” అన్నాడు.ఆయన ముఖంలో బాధ, దుఃఖం కనిపించాయి. నాతోపాటే ఇంటివరకూ వచ్చాడు. టెంటు, కుర్చీలు అన్నీ సర్దేసి.. అంతా పూర్తయ్యే సరికి సాయంత్రమైంది.
“రెండు రోజుల్నుండి ఏమీ తినలేదు. బాధ పడటానికైనా ఓపిక ఉండాలి కదా! ముఖం కడుక్కుని తినండి!” అని నా భార్య అనడంతో, బ్రష్, స్నానం చేసి కొంచెం తిన్నాను. రాత్రయ్యాక పడుకున్నా నిద్రపట్టలేదు. కొడుకుని నిద్రపుచ్చి నా దగ్గరకొచ్చి..“ఏంటీ? ఇంకా పడుకోలేదా?” అడిగింది నా భార్య.నిద్ర రావడం లేదని చెప్పాను.
“మనతో ఉండే ప్రతిమనిషికీ చివరి రోజంటూ ఒకటుంటుంది. వాళ్లు చనిపొతే మన జీవితంలో నుంచి వెళ్లిపోతారు. వాళ్లతోపాటు వాళ్లు పోషించిన పాత్ర కూడా వెళ్లిపోతుంది. కానీ, వాళ్ల జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. వాటినే తలుచుకుంటూ బాధపడితే జీవితం ముందుకు సాగదు. మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది. అది ఎప్పుడూ ముందుకే సాగుతుంది కానీ, వెనక్కి రాదు. ఆ ప్రవాహానికి ఏదైనా అడ్డొస్తే వాటిని తొలగించుకుని వెళుతుంది. అలా వీలు కాకపోతే పక్కగా ప్రవహిస్తుంది. మనిషి జీవితం కూడా అంతే! ఏదైనా జరగరానిది జరిగితే.. తప్పుకొని ముందుకు వెళ్లాలే తప్ప, అక్కడే ఆగిపోకూడదు. జరిగినదాని గురించే ఆలో చిస్తే బాధ తప్ప ఏమీ మిగలదు. ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి!” అని చెప్పి, నన్ను పడుకోబెట్టింది.
మనిషి మరణిస్తే కలిగే బాధ ఇదే మొదటిసారి అనుభవం. అందులోనూ కన్నతల్లి మరణం. అప్పుడే ఎక్కడో చదివిన ఓ కవిత గుర్తుకొచ్చింది.
మరణం కాలం విసిరేసిన ఓ విధి ప్రతి మనిషి చివరి మజిలీ మనుషుల్ని విడదీసేందుకు ఏ కొలిమిలోనూ, ప్రయోగశాలలోనూ తయారుచెయ్యని ఓ ఆయుధం ఏ మనిషి అడ్డుకోలేని, ఆపలేని ఓ సంఘటన పాత్ర ముగిసిన జీవితాల్ని కనుమరుగు చేసే ఓ ఇంద్రజాలం
బతికున్నవాళ్లు చనిపోయిన వాళ్లను తలుచుకుని,గుర్తుచేసుకుని బాధపడే ఓ అవస్థ.జీవితం, బంధాలు అశాశ్వతం! మరణమే శాశ్వతం!
ఉదయం నిద్ర లేచాను. అమ్మ జ్ఞాపకం వస్తుండటంతో ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. తయారై ఆఫీస్‌కి వెళ్లాను. అందరూ నావైపు ఆశ్చర్యంగా చూసారు. మొన్ననే అమ్మ చనిపోతే అప్పుడే వచ్చాడేంటి? అని.“ఏంట్రా అప్పుడే వచ్చేసావ్? కొన్ని రోజులు సెలవు తీసుకోవచ్చుగా” అన్నాడు ఉమేష్.
ఇంట్లో ఉంటే అమ్మ గుర్తొస్తోందని, ఉండబుద్ధి కాక వచ్చానని చెప్పాను. సాయంత్రం వరకు పనిచేసాను. అందరూ ఇంటికి వెళ్లిపోతుంటే నేనూ బయల్దేరాను, కానీ వెళ్లబుద్ధి కాలేదు. ఓ పార్కులోకి వెళ్లి సిమెంట్ బెంచిమీద కూర్చున్నాను. నాకెదురుగా ఇద్దరు దంపతులు, వాళ్లతోపాటు వాళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఆ పిల్లాడి వయసు ఇంచుమించు నా కొడుకు వయసే ఉంటుంది. వాళ్లనాన్న సెల్ఫోన్లో పాటలు పెడితే అందులోనుంచి వచ్చే సంగీతానికి అనుగుణంగా సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాడు. వాళ్లమ్మ చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తోంది. నా పెదాలపై చిరునవ్వు మొలిచింది. నా జీవితంలో అలాంటి సంఘటన జరగలేదు. ఇక ముందు జరిగే అవకాశం కూడా లేదు. పెదాలు బిగుసుకు పోయాయి. అతికష్టం మీద నా భావోద్వేగాల్ని అదుపు చేసుకున్నాను. నా భార్య ఫోన్ చేసి.. “ఎక్కడున్నారు? చీకటి పడే వేళయింది. త్వరగా ఇంటికి రండి!” అంది.
“సరే!” అని ఫోన్ పెట్టేసి ఇంటికెళ్లాను.
తర్వాతి రోజు యథాలాపంగా ఆఫీస్‌కి బయల్దేరాను.“అన్నా! ముగ్గు తొక్కేస్తున్నారు. పక్కకి వెళ్లండి!” అని కేకేసింది పక్కింటి అమ్మాయి.
కిందచూస్తే పెద్ద ముగ్గు. వాళ్లింటి ముందునుంచి మా ఇంటి వరకూ వేసిఉంది. చప్పున పక్కకెళ్లి..“ఏంటి? ఇంతపెద్ద ముగ్గువేశావు?” అడిగానుఆ అమ్మాయిని.“సంక్రాతి నెల ప్రారంభమయ్యింది.. అందుకే!” అంది చిరునవ్వుతో.ఇంటివైపు చూశాను. ఇల్లంతా మొగుడు పోయిన ముండమోపిలా బోసిపోయి ఉంది. అక్కడక్కడా రంగువెలిసిపోయి, మరికొన్నిచోట్ల చిన్నచిన్న పెచ్చులూడిపోయి. అమ్మకి సంక్రాంతి పండగ అంటే ఎంతో ఇష్టం. పండగ నెల ప్రారంభమయ్యిందంటే.. ఇల్లంతా శుభ్రం చేసి పాతసామానంతా స్టోర్ రూంలో పెడుతుంది.. భోగి రోజు కోసం. చిన్నచిన్న మరమ్మతులుంటే చేయించి, రంగులు వేయిస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, గడపకి పసుపు పూసేది. ఇంటిముందు చుక్కలతో ముగ్గులేసి.. మధ్యలో గొబ్బెమ్మలు పెట్టేది. ఇల్లంతా పండగ కళని సంతరించుకునేది. గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు వస్తే.. ఎప్పుడూ వట్టిచేత్తో పంపేది కాదు. కొత్తబట్టలు కొనిపెట్టేది. పండగరోజు చేసే చక్కర పొంగలి అంటే నాకెంతో ఇష్టం. ఆ ఆలోచనలతోనే ఆఫీస్‌కి చేరుకున్నాను. రోజూ వెళ్లి పనిలో నిమగ్నమవ్వడంతో కొద్దికొద్దిగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాను. పండగ కూడా వెళ్లిపోయింది.
రెండు నెలలు గడిచాయి. ఆఫీస్‌కి టైం అవ్వడంతో హడావుడిగా బయల్దేరుతున్నాను.“సాయంత్రం త్వరగా రండి! షాపింగ్‌కి వెళ్లాలి” అంది నాభార్య.
“ఎందుకు?” అడిగాను.“ఎల్లుండి నా హ్యాపీ బర్త్ డే! కొత్తబట్టలు కావాలి” అన్నాడు నా కొడుకు దేవాన్ష్.“సరే!” అని వెళ్లిపోయాను. సాయంత్రం ఇంటికి వచ్చాక..“ఈసారి అబ్బాయి పుట్టిన రోజు ఎక్కడ చేద్దాం?” అడిగింది నా భార్య.ప్రతి సంవత్సరం నా కొడుకు పుట్టిన రోజు ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి.. అక్కడి పిల్లలకి స్వీట్లు, పళ్లు పంచి పెడుతుంటాం. అందుకే అలా అడిగింది.“ఈసారి ఏదైనా వృద్ధాశ్రమంలో చేద్దాం” అన్నాను.
రెండు క్షణాలు నావైపు చూసి..“సరే మీ ఇష్టం!” అంది.నాకు తెలిసిన వాళ్లద్వారా ఓ వృద్ధాశ్రమం వివరాలు కనుక్కుని.. అక్కడికి వెళ్లి నా కొడుకు పుట్టినరోజు జరపాలని నిర్ణయించుకున్నాను. ఆశ్రమ నిర్వాహకుడు ప్రభాకర్. అతనితో ముందుగానే మాట్లాడి అన్ని వివరాలూ తెలియజేశాను. ఆయన అంగీకరించాడు. పుట్టినరోజు నాడు పళ్లు తీసుకుని వృద్ధాశ్రమానికి వెళ్లాం. ముందుగా మావాడి చేత కేక్ కట్ చేయించి, అందరికీ వాడిచేత పళ్లు ఇప్పిస్తున్నాను. కొద్దిదూరంలో అమ్మ కనిపించింది. మా వాడ్ని, వాడి చేతిలోని పళ్లు వదిలేసి..“అమ్మా..” అంటూ ఆమె దగ్గరికి పరిగెత్తాను.
అందరూ నావైపు ఆశ్చర్యంగా చూసారు.
“ఆమె మీ అమ్మకాదు” అంది ఆమె పక్కన కూర్చున్న ఓ వృద్ధురాలు.“మీ అమ్మగారు చనిపోయారటగా?!” అన్నారెవరో వెనకనుంచి. కొన్నిక్షణాలు నా మెదడు మొద్దుబారి పోయింది. అమాంతం పేద్ద లోతైన అగాధపు లోయలోకి జారిపడిపోయినట్టు అనిపించింది నాకు. అక్కడనించి దూరంగా పరుగెత్తి.. ‘అమ్మా..’ అని గట్టిగా అరిచి ఏడవాలనిపించింది. నా కళ్లనుంచి రెండు కన్నీటి బొట్లు జలజలా రాలాయి.. నా ప్రమేయం లేకుండానే.
“ఏమైంది బాబు!?” అని ఆమె నా దగ్గరికి వచ్చి, నా కన్నీళ్లు తుడిచి..“నా పేరు వసుంధర. మీ అమ్మను కాదు!” అంది.
“సార్! ఆమెకు పిల్లలు లేరు. భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి ఈ ఆశ్రమంలో అనాథగా ఉంటోంది” అన్నాడు ప్రభాకర్ వెనకనుంచి.
ఆమె వైపు చూసాను. అవును.. ఆమె మా అమ్మకాదు. కానీ అమ్మ పోలికలు మాత్రం ఉన్నాయి. కళ్లు, ముక్కు అచ్చం అమ్మలాగే ఉన్నాయి. అదే రంగు, అమ్మకంటే ఒకటి రెండేళ్లు ఎక్కువ వయసు ఉండొచ్చు. అమ్మకంటే ఓ రెండంగుళాలు ఎత్తు తక్కువ కూడా. కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుని.. నా కొడుకుని పిలిచి ఆమెకు పళ్లు నేనే నా చేతులతో ఇచ్చాను. నా కొడుకు ఆమెను చూసి..“ఎవరీమె! నానమ్మలా ఉంది” అన్నాడు.
“నానమ్మ కాదు!” అని మిగతా వాళ్లకు పళ్లు ఇప్పించాను. అక్కడ ఉన్నంత సేపు ఆమెతో మళ్లీమళ్లీ మాట్లాడాను. ‘అమ్మా’ అని పిలిచాను. తిరిగి వెళ్లేటప్పుడు వెళ్లొస్తానని చెప్పాను. ఆమె జాగ్రత్తగా వెళ్లండని చెప్పింది.రాత్రి భోజనం చేసి పడుకుని ఆలోచిస్తున్నాను.“ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకా పడుకోకుండా!” అంది నా భార్య వచ్చి.“వసుంధర గారిని దత్తత తీసుకుందామని అనుకుంటున్నాను” అన్నాను.“నిజంగానా?” అన్నది.“అవును” అన్నాను.“సరే! ఎవరూలేని అనాథ. మనతో కలిసుంటానంటే తీసుకోండి!” అంది.ఉదయాన్నే ప్రభాకర్ గారికి ఫోన్‌చేసి మాట్లాడాను.“ఆమెను అడగండి, ఒప్పుకొంటే నాకెలాంటి అభ్యంతరం లేదు” అన్నాడు.ఆఫీస్‌కి సెలవు పెట్టి వెళ్లి వసుంధర గారిని కలిసాను. ఆమెతో విషయం చెప్పి.. కన్నతల్లిలా చూసుకుంటానని, దత్తత తీసుకోడానికి ఒప్పుకోమని ప్రాధేయపడ్డాను.
“నాకూ పిల్లలు లేరు బాబు. ఈ వయసులోనైనా ఆ భగవంతుడు కరుణించాడని అనుకుంటాను” అని ఒప్పుకొంది. వెంటనే నా భార్యకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాను. ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చాను. అమ్మ గదికి వెళ్లాను, అంతా శుభ్రం చేశాను. నాకు తెలిసిన తాపీ పని వాళ్లను పిలిచి.. ఇల్లంతా చిన్నచిన్న రిపేర్లు చేయించాను. రంగులు కూడా వేయించాను. అమ్మ గదికి ఏసీ పెట్టించాను.వసుంధర గారిని దత్తత తీసుకుంటున్నానని, ఆమెను నాకన్న తల్లిలా చూసుకోబోతున్నాని ఆఫీస్‌లో చెప్పాను. ఆరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాననీ, తప్పకుండా ఇంటికి రావాలని ఆహ్వానించాను. నా వెనుక కొంతమంది గుసగుసగా మాట్లాడుకున్నారు.“అదేంటి? రేపోమాపో చావబోయే ముసలిదాన్ని దత్తత తీసుకుంటున్నాడు. ఏమైనా పిచ్చా! ఓ అనాథ బాలుడ్ని దత్తత తీసుకుని చదివిస్తే పెద్దవాడయ్యాక కట్నం వస్తుంది. డబ్బుంటే సరిపోతుందా! అనుభవించే ఇది లేదు. నేనైతేనా.. రోజుకో అమ్మాయితో”.. అన్నాడు ఈ మధ్యే కొత్తగా చేరిన ఓ కుర్రాడు. అవన్నీ కూరలో కరివేపాకులా తీసి పారేసాను.
దత్తత తీసుకునే రోజు రానే వచ్చింది. మనసెంతో ఉల్లాసంగా, అనందంగా ఉంది. ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయాను. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాను. భార్య చేత గడపకి పసుపు పూయించాను. పక్కింటి అమ్మాయిని బతిమాలి ఇంటిముందు ముగ్గు వేయించాను. ప్రభాకర్ దత్తత స్వీకారానికి ముందు ఓ సభను ఏర్పాటు చేసాడు. అక్కడికి స్నేహితుల్ని, తెలిసిన వాళ్లను పిలిచాను.
“ఇప్పటివరకూ అనాథల్ని, చిన్నపిల్లల్ని దత్తత తీసుకోడం మనం చూశాం. కానీ, ఇలా వృద్ధురాల్ని దత్తత తీసుకోవడం మొదటిసారి చూస్తున్నాం. ఈయనకి ఉన్న ఈ గొప్ప మనసు భగవంతుడు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ, ములగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేసాడు. నేను అవేమి పట్టించుకోకుండా ఆగస్టు పదిహేనురోజు ఎప్పుడెప్పుడు జెండా ఎగరేస్తారా? చాక్లెట్లు ఎప్పుడెప్పుడు పంచుతారా? అని స్కూలు పిల్లాడు ఎదురు చూసినట్టుగా.. దత్తత కార్యక్రమం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు వసుంధర గారిని ఇంటికి తీసుకెల్దామా? అని ఎదురుచూస్తున్నాను. కార్యక్రమం పూర్తయ్యింది. వసుంధర గారిని ఇంటికి తీసుకెళ్లాను.
“అమ్మా..” అని పిలిచాను.
ఎందుకో తెలుగు భాషలో అంతకన్నా మధురమైన పదం లేదనిపించింది. మళ్లీ అమ్మ దొరికినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకొన్నాను. అమ్మకి తన గది చూపించాను. ఆ గది తనదే అని ఆ గదిలోని వస్తువులన్నీ తననే వాడుకోమని చెప్పాను. ఆమె సంతోషించింది. అమ్మకు ఏమి ఇష్టమో అడిగి తెలుసుకుని.. భోజనాలు ఏర్పాటు చేశాను. సాయంత్రం ఆఫీస్ స్నేహితులు కొంతమంది వచ్చి, తినేసి వెళ్లిపోయారు. నేను, నా కుటుంబం అమ్మతో కలిసి భోజనం చేశాం. అమ్మఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. గాఢంగా నిద్ర పట్టింది. నన్ను అలా పడుకోబెట్టి.. ఎప్పుడు లేచి వెళ్లిందో తెలియదు. చాలారోజుల తర్వాత ఎంతో ప్రశాంతంగా నిద్ర పోయాను. తెల్లవారింది.ఆఫీస్ నుండి ఉమేష్ ఫోన్ చేసాడు. అపార్టుమెంట్ డిజైన్ బ్లూ ప్రింట్, బిల్డర్ త్వరగా పూర్తిచేసి ఇవ్వమన్నాడని.. వెంటనే ఆఫీస్‌కి రమ్మని చెప్పాడు. నేను హడావుడిగా ఆఫీస్‌కి బయల్దేరాను.“ఎక్కడికి బాబు?” అడిగింది అమ్మ.“ఆఫీస్‌కి వెళ్తున్నానమ్మా!” చెప్పాను.“టిఫిన్ చేసి వెళ్లు!” అంది.“టైం లేదమ్మా! వచ్చాక తింటాను” అన్నాను.“ఒక్క నిమిషం బాబూ!” అని గబగబా రెండు ఇడ్లీలు, చట్నీ ప్లేట్లో పెట్టుకుని నా దగ్గరికి వచ్చి..“తిను బాబూ!” అంటూ, గోరు ముద్దలు తినిపించింది.గబగబా తినేసి, నీళ్లు తాగి బయల్దేరాను.తిన్నది రెండు ఇడ్లిలే అయినా.. నా కడుపు నిండిపోయింది. సంతోషంతో నా మనసు ఉప్పొంగింది.
డా. ఐజక్ గుండె
ఆదివారం ప్రత్యేక సంచికలో వచ్చే కథలు చదువుతూ.. బాల్యం నుంచే సాహిత్యంపై ఇష్టం పెంచుకున్నారు రచయిత డా. ఐజక్ గుండె. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే.. రచయితగానూ రాణిస్తున్నారు. ఈయన స్వస్థలం బాపట్ల జిల్లాలోని నూతలపాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, పీహెడీ చేశారు. కాలేజీ రోజుల్లో కవిత్వం, పాటలు రాసి వినిపించేవారు. ‘ఎక్కడ నువ్వు’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. ఇప్పటివరకూ 15 కథలు రాశారు. ఇవన్నీ ఉషా పక్ష పత్రిక, ఉషా వారపత్రిక, నిత్య మాస పత్రిక, తపస్వి మనోహరం అంతర్జాల పత్రిక, నవమల్లె తీగ కథలు సంకలనం, ముళ్ల చినుకులు కథా సంకలనంలోనూ ప్రచురితమయ్యాయి. సాహిత్య సేవలో భాగంగా, తెలుగు వెలుగు సాహితీ వేదిక ఉగాది పురస్కారం (2022) వరించింది. ‘ఎక్కడ నువ్వు’ కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్, చదువుల బాబు సాహిత్య కళా వేదిక జాతీయ పురస్కారం-2025 అందుకున్నారు. పరువు హత్య, పరిడోలియా కథలకూ బహుమతులు దక్కించుకున్నారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి
రూ.3 వేలు పొందిన కథ.
-డా. ఐజక్ గుండె
98667 52159