నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో గల షేక్సాబ్లొద్ది పక్కన ఐదెకరాల రిజర్వు ఫారెస్టు విస్తీర్ణంలో పొనికి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఈ వనములో ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వేల మొక్కలు నాటారు. కూలీలు, ఆయా పనులకు రూ.9,15,677 నిధులు ఖర్చు చేశారు. నీటి సౌకర్యం కోసం నాలుగు బోర్లు వేశారు. వీటిలో రెండు బోర్లు పని చేస్తుండగా.. మరో రెండు పని చేయడం లేదు. దీంతో మూడేండ్ల నుంచి మొక్కలకు నీరు అందక ఎండిపోయి మైదానాన్ని తలపిస్తున్నాయి.
దీంతో పొనికి వనంలో 2 వేల మొక్కలకు ప్రస్తుతం ఐదు నుంచి పది మొక్కలు బతికి ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కలు ఎండిపోయాయి. పొనికి మొక్కలతో కొయ్యబొమ్మల కళాకారులు అందమైన బొమ్మను తయారు చేస్తారు. వనములో మొక్కలు పూర్తిగా ఎండిపోవడంతో కొయ్యబొమ్మల తయారి కష్టంగా మారనుంది. దీంతో అనుకున్న లక్ష్యం నీరుగారి పోతుంది. అధికారులు స్పందించి పొనికి వనములో తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో లక్ష్మీకాంత్ను వివరణ కోరగా.. బండభూమి వల్ల మొక్కలు ఎండిపోతున్నాయని, కరెంట్ దర్గా నుంచి తీసుకోవడం వల్ల కోతులు వైర్లను తెంపేస్తున్నాయని, బోర్ల ఉన్న గ్రౌండ్ వాటర్ సరిగా లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు.
– సారంగాపూర్, ఫిబ్రవరి 28