తుంగతుర్తి, ఆగస్టు 05 : కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై అసత్య, అసందర్భ ఆరోపణలు చేస్తూ క్షుద్ర పూజలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. మండల పరిధిలోని బండరాంమారం గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పాలనలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు క్షుద్ర పూజలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా లేక తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారా ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ అవి ఉన్నాయని మీరు నమ్మితే మా నాయకుని విమర్శించడం మానుకుని మీ పాలన సక్రమంగా నడవాలని మీరు పూజలు చేయండని హితవు పలికారు. లేదంటే మీరు చేసిన తప్పుడు ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్ పాల్గొన్నారు.