Gold Price | ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రపంచ సంకేతాల మధ్య బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధర మంగళవారం ఒకే రోజు రూ.2,700 పెరిగి తులానికి రూ.1,18,900 చేరి సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. మరో వైపు యూఎస్ హెచ్1బీ వీసా ఫీజు పెరుగుదల కారణంగా రూపాయి కొత్త కనిష్ఠానికి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.2,650 పెరిగి 10 గ్రాములకు రూ.1,18,300 జీవితకాల గరిష్టానికి చేరుకుంది. అదే సమయంలో వెండి సైతం భారీగా పెరిగింది. రూ.3,220 పెరిగి కిలోకు రూ.1,39,600 చేరి ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. యూఎస్ డాలర్‌తో పోలిస్తూ రూపాయి పతనం కావడంతో బంగారం, వెండి ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. డాలర్‌తో పోలిస్తే మంగళవారం రూపాయి 47 పైసలు తగ్గి 88.75 వద్ద కనిష్టానికి చేరుకుంది.
హెచ్1బీ వీసాల ఫీజులు భారీగా పెరగడంతో విదేశీ మూలధనం ఉపసంహరించుకుంటున్నారని.. ఇది భారత ఐటీ సేవల ఎగుమతులకు పెద్ద దెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్‌లో డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.520 పెరిగి 10 గ్రాములకు రూ.1,12,750 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి పెరిగింది. అదే సమయంలో డిపెంబర్ కాంట్రాక్ట్ రూ.530 పెరిగి 10 గ్రాములకు రూ.1,13,750కి చేరుకుంది. ఇది సరికొత్త రికార్డు ధర. ఇక వెండి ధరలు సైతం పెరుగుతూ సరికొత్త జీవనకాల గరిష్ఠానికి పెరిగాయి. డిసెంబర్ డెలివరీ కోసం వెండి ఫ్యూచర్స్ రూ.461 పెరిగి కిలోకు రూ.1,34,016 పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో డెలివరీ చేయాల్సిన వెండి ఫ్యూచర్స్ MCXలో రూ.508 పెరిగి కిలోకు రూ.1,35,397 వద్ద ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి.
బులియన్ మార్కెట్లో ర్యాలీకి అనేక కారణాలున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత ఒకటి. రాబోయే రోజుల్లో మరింత కోత విధించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం ఓ కారణం కాగా.. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం పెద్ద ఎత్తున బంగారం కొంటుండడం కూడా కారణం. బంగారం, వెండి ధరలు తగ్గే సంకేతాలు కనిపించడం లేదని.. బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను చేరుకున్నాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ కోత విధించడం.. ఈ సంవత్సరం చివరినాటికి మరింత కోతలు విధించే అవకాశం ఉందన్న అంచనాలు సెంటిమెంట్‌ను బలపరిచాయని కలాంత్రి పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఒకశాతం కంటే ఎక్కువ పెరిగి 3,791.10 డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. స్పాట్ వెండి ఔన్సుకు 0.57 శాతం పెరిగి 44.32 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్‌లో ధరల విషయానికి వస్తే 24 క్యారెట్ల పసిడి రూ.1,15,690 ఉండగా.. 22 క్యారెట్ల పుత్తడి రూ.1,06,050 ధర పలుకుతున్నది. ఇక వెండి రూ.1.50లక్షల వద్ద కొనసాగుతున్నది.