Cancer Causing Foods | ప్రస్తుత కాలంలో అతి భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. పర్యావరణం, జన్యుమార్పులు ఈ వ్యాధి బారిన పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా నిశ్శబ్దంగా క్యాన్సర్ బారిన పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరు రకాల రోజు వారి ఆహారాలను మన ప్లేట్ నుండి తీసేయడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్రమైన సానుకూల ప్రభావం ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. క్యాన్సర్ కు కారణమయ్యే ఆహారాల గురించి అలాగే వాటికి బదులుగా తీసుకోదగిన ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాసెస్ చేసిన మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రాసెస్ చేసిన మాంసం గ్రూప్ 1 క్యాన్సర్ కారకాల కిందికి వస్తుందని దీనిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మాంసంలో ఉండే నైట్రేట్లు, ప్రిజర్వేటివ్స్ పేగు లైనింగ్ కణాలను దెబ్బతీయడంతో పాటు క్యాన్సర్ మార్పులను ప్రోత్సహిస్తాయి. కనుక వీటిని తీసుకోకపోవడమే మంచిదని వీటిని బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే చిక్కుళ్ళు, కాయధాన్యాలు, మొక్క ఆధారిత ప్రోటీన్ ను తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లేవర్ డ్రింక్స్, అధిక చక్కెరలు ఉండే శీతల పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు దీర్ఘకాలిక మంటను పెంచుతాయి. ఇవి క్యాన్సర్ పురోగతిని కూడా వేగవంతం చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రొమ్ము, ప్యాంక్రియాటిక్, పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటికి బదులుగా కొబ్బరి నీరు, ఇంట్లో తయారు చేసిన చక్కెర లేని జ్యూస్ లు, హెర్బల్ టీ లు తీసుకోవడం మంచిది.
డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ముఖ్యంగా తిరిగి ఉపయోగించిన నూనెలో చేసిన ఆహారాల్లో అక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది వాపును ప్రేరేపించే, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే సమ్మేళనం. తరచూ డీప్ ప్రై చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ కు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. కనుక వీటికి బదులుగా బేకింగ్ చేసిన ఆహారాలను, ఆలివ్ నూనె ఉపయోగించి చేసిన ఆహారాలను, కాల్చిన కూరగాయలను తీసుకునే ప్రయత్నం చేయాలి. గ్రిల్ చేసిన మాంసం హెటెరోసైక్లిక్ అమైన్ లు, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇది డీఎన్ఏ దెబ్బతినేలా చేసి క్యాన్సర్ బారిన పడేలా చేస్తుంది. కనుక ఆవిరి మీద ఉడికించడం లేదా బేకింగ్ చేయడం చేయాలి. ఒకవేళ గ్రిల్ చేయాల్సి వస్తే మాంసాన్ని ముందుగానే మ్యారినేట్ చేయడం వల్ల హానికారక సమ్మేళనాలు విడుదల అవ్వకుండా ఉంటాయి.
ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈస్ట్రోజన్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. శరీరం డీఎన్ఏ మరమ్మత్తులో కీలక పాత్ర పోషించే ఫోలేట్ వంటి కీలక పోషకాలను గ్రహించే సామర్థ్యం కోల్పోతుంది. కనుక ఆల్కహాల్ ను తీసుకోవడం తగ్గించాలి. దీనికి బదులుగా కూరగాయల జ్యూస్ లను, పండ్ల జ్యూస్ లను తీసుకోవాలి. ప్యాక్ చేసిన చిరుతిండ్లు, ఇన్స్టంట్ ఆహారాలు క్యాన్సర్ బారిన పడేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోకృత్రిమ సంకలనాలు, శుద్ది చేసిన చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక మంటను కలిగిస్తాయని ఇది క్రమంగా క్యాన్సర్ గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ ఆరు రకాల ఆహారాలు మనల్ని క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయని కనుక వీటిని తీసుకోవడం తగ్గించాలని లేదా పూర్తిగా మానేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.