PM salute : నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం అంటారు. అందుకే చాలామంది తమకు నమస్కారం చేసిన వ్యక్తులు వయసులో చిన్నవాళ్లు అయినప్పటికీ వారికి తిరిగి నమస్కారం చేస్తారు. తాజాగా ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కూడా తనకు నమస్కారం చేసిన ఓ బుడ్డోడికి ప్రతినమస్కారం చేసి తన సంస్కారాన్ని చాటుకున్నారు. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని భావ్నగర్ (Bhavnagar) లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని నరేంద్రమోదీ శనివారం గుజరాత్లోని భావ్నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. రోడ్డు పొడవునా జనం చేతులు ఊపుతూ ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
ప్రధాని వాహనం తనను సమీపించగానే రోడ్డుపక్కన జనాల్లో ఉన్న ఓ బుడ్డోడు ఆయనకు హుషారుగా నవ్వుతూ నమస్కారం చేశాడు. అది గమనించిన ప్రధాని మోదీ నవ్వుతూ ఆ బుడ్డోడికి తిరిగి నమస్కారం చేశారు. ప్రధాని వాహనం ముందుకు కదులుతుంటే ప్రధాని తలవెనుకకు తిప్పి మరీ బుడ్డోడికి నమస్కరించడం కనిపించింది. ప్రధాని తిరిగి నమస్కరించడంతో ఆ బుడ్డోడు కూడా ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
తనకు ప్రధాని మోదీ ప్రతినమస్కారం చేసిన విషయాన్ని ఆ బుడ్డోడు పట్టరాని సంతోషంతో తన తల్లికి చెప్పే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపిస్తోంది. కానీ అతడి తల్లి మాత్రం అతడి సంతోషాన్ని గమనించలేకపోయింది. ఎందుకంటే ఆమె కూడా అప్పటికే సంతోషంగా ఎడమచేయి ఊపుతూ ప్రధానికి స్వాగతం పలుకుతోంది. కుడిచేత్తో మొబైల్ పట్టుకుని పట్టుకుని ప్రధానిని వీడియో తీస్తోంది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా చూడవచ్చు…
#WATCH | Bhavnagar, Gujarat | PM Narendra Modi responds with a salute to a child who was saluting him during the roadshow in Bhavnagar pic.twitter.com/b64ZW8mHZ9
— ANI (@ANI) September 20, 2025