కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట రూ. లక్షన్నర కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 3,300 ఎకరాల భూములపై రేవంత్‌రెడ్డికి కన్నుపడిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ల్యాండ్ బ్యాంకుగా మారుస్తున్నారన్నారు. కనీసం డీపీఆర్ లేకుండా ప్రజల ఇండ్లను కూల్చి..రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సుందకరీకరణపై శనివారం హిమాయత్‌సాగర్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూల్చకుండా మూసీని సుందరీకరించేందుకు ప్రణాళికను ఎలా రూపొందించి అమలు చేసిందో తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు నష్టం కలిగించకుండా అతి తక్కువ ఖర్చుతో మురుగును పారదోలేందుకు అనుసరించిన విధానాన్ని వివరించారు.
సిటీబ్యూరో/బండ్లగూడ, మార్చి14(నమస్తే తెలంగాణ) ; మూసీ సుందరీకరణలో కేసీఆర్‌ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని, అరచేతిలో స్వర్గం చూపారని ఎద్దేవా చేశారు. బఫర్ జోన్ పేరిట ప్రజల ఇండ్లను కూల్చి అదే ప్రాంతంలో పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తామని గ్రాఫిక్స్‌లో చూపారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి ప్రజలను రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. మూసీ పరీవాహకంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా.. పేద ప్రజల ఇండ్లను కూల్చనీయమని అభయమిచ్చారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ.. ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా మూసీని సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు.
ఒక్క ఇంటిని కూల్చకుండా మూసీని సుందరీకరించేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికను రూపొందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పేరిట రూ. లక్షన్నర కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈమేరకు మూసీ సుందకరీకరణపై శనివారం హిమాయత్‌సాగర్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు నష్టం కలిగించకుండా అతి తక్కువ ఖర్చుతో మురుగును పారదోలేందుకు బీఆర్ఎస్ అనుసరించిన విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాధిత ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక్క ఇల్లు కూల్చకుండా, బస్తీల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మూసీ మురుగును పారదోలడమే కేసీఆర్ పాలసీ అని స్పష్టం చేశారు. అందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి మోడళ్లను సిద్ధం చేసి సుందరీకరణ ప్రారంభించారని చెప్పారు.
మూసీ సుందరీకరణకు రూ.16,634 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో భాగంగా 31 ఎస్టీపీలను నిర్మించారని గుర్తు చేశారు. మంచిరేవుల నుంచి కీసర దాకా 57 కిలోమీటర్ల ఎక్స్ హైవేను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మూసీ పొడవునా 15 బ్రడ్జిలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా రూ.లక్షన్నర కోట్లను కొల్లగొట్టేందుకు 3,300 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ల్యాండ్ బ్యాంకుగా మారుస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి ప్రజలను రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. కనీసం డీపీఆర్ లేకుండా ప్రజల ఇండ్లను కూల్చి, రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పల్లె రవికుమార్, కార్తిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐ చిత్రాలను ప్రదర్శించి..అరచేతిలో స్వర్గం చూపారు..
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని కేటీఆర్ అన్నారు. మూసీ పరీవాహక ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో చెప్పకుండా ఏఐ చిత్రాలను ప్రదర్శించి అరచేతిలో స్వర్గం చూపారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చూపించిన సుందరీకరణ నమూనాల్లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నాగోల్ బ్రిడ్జి సహా పలు సుందర కట్టడాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆసాంతం గ్రాఫిక్స్ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. సీఎం అప్పటిదాకా బాధిత ప్రజలకు భూమికి భూమి, ఇంటికి ఇల్లు ఇస్తామంటే ఎంఆర్డీసీఎల్ చైర్మన్ మాత్రం టీడీఆర్ ఇస్తామని తేల్చేశారన్నారు. మూసీ సరోవర్ పేరిట గాంధీ విగ్రహం పెడితే ఎవరూ అడ్డుచెప్పరనే చీఫ్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు. బఫర్ జోన్ పేరిట ప్రజల ఇండ్లను కూల్చి అదే ప్రాంతంలో భవనాలు నిర్మిస్తామని గ్రాఫిక్స్‌లో చూపారన్నారు.
బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా
హిమాయత్‌సాగర్‌లో కేటీఆర్ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు మూసీ పరీవాహకంలో ఇండ్లను కోల్పోతున్న బాధితులు తరలివచ్చారు. హైదర్షాకోట్, సాయిరాం నగర్, డ్రీమ్ వ్యాలీ కాలనీ, విగ్నేశ్వర కాలనీ, మధు పార్క్ రిడ్జ్, కీర్తి రిచ్మండ్ విల్లా, హనుమాన్ నగర్, హిమాయత్ సాగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరికీ అండగా నిలిచి పోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వాంసాన్ని తమ ప్రాంతానికి వచ్చి చూడాలని కేటీఆర్‌ను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుఖ సంతోషాలతో ఉండేవారిమని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వాపోయారు. మూసీకి దూరంగా ఉన్నా తమ ఇండ్లకు మార్కింగ్‌లు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్ల దాకా ఇండ్లను కాంగ్రెస్ చెర నుంచి కాపాడుకోవాలని, ఆ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేటీఆర్ వారికి భరోసా కల్పించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని.. అందరూ ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఒక్కరి ఇంటిని కూలుస్తామని నోటీసులు ఇస్తే అందరూ కలిసి కట్టుగా పోరాడాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎప్పటికీ అండగా ఉంటారని హామీ ఇచ్చారు.

కేసీఆర్ మోడల్ జీరో డీమాలిషన్
మూసీ సుందరీకరణలో కేసీఆర్‌ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు కూకట్పల్లి నాలా ప్రవాహంతో ఇండ్లలోకి మురుగు వస్తుందని, దాన్ని అరకట్టాలంటే వందలాది ఇండ్లను ఖాళీ చేయాలంటే కేసీఆర్ ఒప్పుకోలేదని, ఒక్క ఇంటిని కూల్చొద్దని అన్నారని గుర్తు చేశారు. ఒక్క ఇంటిని కూల్చకుండా నాలా లోతును పెంచి ప్రవాహం ఇండ్లలోకి రాకుండా అడ్డుకట్ట వేశారని.. అది కేసీఆర్ విజన్ అని అన్నారు. మూసీ సుందరీకరణలో ఒక్క ఇంటిని కూల్చకుండా మురుగును పారదోలేందుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా పేద ప్రజల ఇండ్లను కూల్చనీయమని చెప్పారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీని సుందరీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ రేవంత్‌రెడ్డిది మాత్రం డిస్ట్రక్షన్ మోడల్ అని.. అడ్డొచ్చిన పేదల ఇండ్లను కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే ఆయన విజన్ అని ఎద్దేవా చేశారు
సీఎం రేవంత్‌రెడ్డిది విధ్వంస పాలన ; బీఆర్ఎస్ నేత కార్తీక్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బాధితులే లేకుండా మూసీని అభివృద్ధి చేయాలని భావిస్తే.. బాధితుల శవాల మీద మూసీని సుందరీకరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. మూసీ బాధితులు, వారి అభిప్రాయాలు లేకుండా పవర్ పా యింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కనీసం బాధితులకు ఏం చేస్తారో ఎలా ఆదుకుంటారో చెప్తారని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. హిమాయత్ సాగర్, హనుమాన్ నగర్ మూసీకి 500 మీటర్ల దూరంలో ఉన్నా నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా.. భూములను కొల్లగొట్టడే పరమావధిగా సీఎం పాలన సాగిస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం సహా హైదరాబాద్‌లోని మూసీ పరీవాహకంలోని ఒక్క ఇల్లును కూల్చకుండా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.
పట్టా భూమిలో కట్టుకున్న ఇంటికి నోటీసులు
25 ఏండ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో పట్టా భూమిని కొనుక్కుని ఇంటిని కట్టుకుంటే కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. మా ఇల్లు నది నుంచి 500 మీటర్ల దూరంలో ఉంది. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 500 మీటర్ల దూరంలో ఇండ్లను దేని కోసం కూలుస్తామంటున్నారు? అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక ప్రణాళిక లేకుండా మాకు నోటీసులు ఇస్తే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. సుందరీకరణ చేయండి… మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ అన్ని అనుమతులుండి పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న మా ఇండ్లను కూల్చొద్దు.
-సుభాని, మూసీ బాధితుడు, హిమాయత్‌సాగర్
నోటీసులు వచ్చినప్పటి నుంచి నిద్ర పడ్తలేదు
మా ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు. కష్టపడి కట్టుకున్న ఇల్లును ఏ కారణం లేకుండా ఎలా కూలుస్తారు? సర్వేకు అధికారులు వచ్చి మా అభ్యంతరాలను చెప్పాలన్నారు. ఆర్డీవో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్లి మేం ఇండ్లను కూల్చనివ్వం.. ఇక్కడి నుంచి కదలబోమని తేల్చి చెప్పాం. అయినా మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ వచ్చి మార్కింగ్‌లు చేశారు. .ప్రజల అ భిప్రాయాలు లెక్కచేయకుండా ప్రభుత్వాలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి? ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓఆర్ఆర్ కింద భూమి కోల్పోయిన వారికి ఇచ్చిన స్థలాలను కూడా తీసుకుంటామని నోటీసులు ఇచ్చారు. ఇవ్వడం వారి వంతే తీసుకోవడం వారి వంతేనా..?
– సాయి రెడ్డి, బాధితుడు, హిమాయత్‌సాగర్
నిజాం ఇచ్చిన ఇండ్ల స్థలం మీరెలా లాక్కుంటారు..
బట్టిగూడెం అనే మా గ్రామం మొదట హిమాయత్‌సాగర్ చెరువులో కింద ఉండేది. రిజర్వాయర్ చేసేటప్పుడు నిజాం మా గ్రామాన్ని తరలించి ఇక్కడ స్థలాలు ఇచ్చారు. రిజర్వాయర్ కట్టేందుకు మా తాతలు పనులకు వెళ్తే కూలీ కింద ఈ భూములను ఇచ్చారు. వందేండ్ల కింద పని చేసినందుకు ఇచ్చిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటానంటే సహించం. ఆ భూములకు 2003, 2013లో ఆ తర్వాత తెలంగాణ వచ్చినాక ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వమే లాక్కుంటానంటున్నది. మా గ్రామం జోలికి వస్తే అందరం ఒక్కటవుతాం. ఐకమత్యంగా ఉండి ప్రభుత్వాన్ని అడ్డుకుని మా ఇండ్లను కాపాడుకుంటాం.
-ఆంజనేయులు, మాజీ సర్పంచ్, హిమాయత్‌సాగర్
ఎమ్మెల్యే ఇండ్లు ఖాళీ చేయాలంటున్నారు
హనుమాన్‌నగర్ 50 ఏండ్ల కిందట ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడే బతుకు తున్నాం. ఇప్పుడు అధికారులు వచ్చి మా ఇండ్లను ఖాళీ చేయాలంటున్నారు. మా ఎమ్మెల్యే దగ్గరి వెళ్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఏం చేయలేం. వేరే దగ్గర డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం తప్పనిసరిగా ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. ఏండ్ల తరబడిగా ఇక్కడే బతికి ఇప్పుడు ఎక్కడికో వెళ్లాలంటే ఎలా? అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే అలా మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? మా ప్రాణాలు తీసినా హనుమాన్‌నగర్ నుంచి కదలబోం. ఎవరు వచ్చినా ఐకమత్యంతో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతం.
– నారాయణ స్వామి, బాధితుడు, హనుమాన్ నగర్