Mamata Banerjee | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) రాక సందర్భంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake Stadium)లో నిర్వహించిన ఈవెంట్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈవెంట్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో మెస్సి ఆడాల్సి ఉండగా.. ఆడలేదు. అంతేకాదు, గ్రౌండ్ నుంచి మెస్సి చాలా త్వరగా వెళ్లిపోయారు. దీంతో కోల్‌కతా సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. తమ అభిమాన ఆటగాడిని చూసే అవకాశం రాకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రౌండ్‌లోని టెంట్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేసిన నిరసన తెలిపారు. ఫ్యాన్స్ రచ్చతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరికాసేపట్లో కార్యక్రమానికి రావాల్సి ఉండగా.. తాజా ఘటనతో ఆమె మార్గం మధ్యలోనే వెనుదిరిగారు. ఈ మేరకు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈవెంట్ నిర్వహణ వైఫల్యం నేపథ్యంలో మెస్సితోపాటు ఆయన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు. ఫుట్‌బాల్ ఐకాన్ లియోనల్ మెస్సి పాల్గొన్న కార్యక్రమంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్బ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి నేను తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా అసౌకర్యంగా భావించిన లయోనల్ మెస్సి, అలాగే క్రీడా ప్రేమికులకు, అభిమానులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను’ అని తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అశింకుమార్ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు దీదీ ప్రకటించారు. ఈ కమిటీ వివరణాత్మక దర్యాప్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తన పోస్టులో రాసుకొచ్చారు.
Also Read..
Lionel Messi | మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్