రాయ్‌పూర్: పోలీస్ అధికారిణి తనను ‘లవ్ ట్రాప్’ చేసి మోసగించిందని ఒక హోటల్ యజమాని ఆరోపించాడు. (Hotelier Accuses Woman Cop Of Love Trap) కోట్లలో డబ్బు, విలువైన బంగారు ఆభరణాలు, కారుతో పాటు ఒక హోటల్‌ను ఆమె కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఆరోపణలను ఆ పోలీస్ అధికారిణి ఖండించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రముఖ హోటల్ యజమాని దీపక్ టాండన్ సంచలన విషయాలు బయటపెట్టాడు. 2017 బ్యాచ్ పోలీసు అధికారిణి డీఎస్పీ కల్పన వర్మ ప్రేమ, పెళ్లి పేరుతో తనను ట్రాప్ చేసిందని ఆరోపించాడు.
కాగా, 2021లో తామిద్దరం కలిశామని, తమ మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని వివాహితుడైన దీపక్ టాండన్ తెలిపాడు. ఈ నాలుగేళ్లలో పెళ్లి పేరుతో తనను నమ్మించి కల్పన మోసగించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.2 కోట్లకు పైగా నగదు, రూ.12 లక్షల డైమండ్ రింగ్, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, లక్ష విలువైన బ్రాస్లెట్, తన ఇన్నోవా క్రిస్టా కారును ఆమె తీసుకున్నదని ఆరోపించాడు. రాయ్‌పూర్‌లోని తన హోటళ్లలో ఒకదానిని ఆమె సోదరుడికి బదిలీ చేయమని ఒత్తిడి తెచ్చిందని, ఆ తర్వాత రూ.30 లక్షలు ఖర్చు చేయించి కల్పన పేరు మీదకు మార్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు డీఎస్పీ కల్పన మరిన్ని డిమాండ్లు చేసిందని, తాను నిరాకరించడంతో తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించడంతోపాటు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నదని దీపక్ టాండన్ ఆరోపించాడు. వాట్సాప్ చాట్లు, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ రికార్డులను సాక్ష్యంగా ఖమ్హార్దిహ్ పోలీస్ స్టేషన్‌కు సమర్పించాడు.
అయితే దీపక్ టాండన్ గతంలో వ్యాపార లావాదేవీలో భాగంగా తనకు డబ్బు బాకీ ఉన్నాడని, టాండన్ భార్య బర్ఖా సెక్యూరిటీగా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యిందని డీఎస్పీ కల్పన తండ్రి హేమంత్ వర్మ ఆరోపించాడు. రెండు నెలల క్రితం పాండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న చెక్ బౌన్స్ కేసు విచారణకు దీపక్ భార్య బర్ఖాను క్రమం తప్పకుండా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ కల్పనపై దీపక్ తాజా ఆరోపణలు, ఫిర్యాదు కలకలం రేపాయి.
కాగా, హోటల్ యజమాని దీపక్ టాండన్ ఆరోపణలను డీఎస్పీ కల్పన ఖండించారు. అవి తప్పుడు ఆరోపణలని, దురుద్దేశంతో కూడినవని, పరువు నష్టం కలిగించేవి అని ఆమె అన్నారు. తన తండ్రికి, దీపక్ మధ్య జరిగిన వ్యాపార వివాదంలోకి తన పేరును లాగుతున్నారని తెలిపారు. వైరల్ అవుతున్న చాట్లు నకిలీవని, తన సోషల్ మీడియా నుంచి ఫొటోలు దొంగిలించి సృష్టించినట్లు ఆరోపించారు. దీపక్ చెబుతున్న కారును ఆయన భార్య బర్ఖా నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆయన ఆరోపణలకు మద్దతు ఇచ్చే రుజువులను సమర్పించాలని సవాల్ చేశారు. భార్య చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి దీపక్ ఈ కథను కల్పించాడని ఆమె ఆరోపించారు.
మరోవైపు హోటల్ యజమాని దీపక్, డీఎస్పీ కల్పన ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నారు. దీపక్ ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే ఆ రాష్ట్ర పోలీసులు, వ్యాపార వర్గాల మధ్య ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:
Mamata Banerjee | ‘సర్’లో పేర్లు తొలగిస్తే.. వంటగది వస్తువులతో మహిళలు పోరాడాలి: మమతా బెనర్జీ
Watch: మత్తులో యువకులు హంగామా.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని బలవంతం
Watch: ఎయిర్‌పోర్ట్‌లోకి పరుపుతో ప్రయాణికుడు.. ఇండిగో విమానాల ఆలస్యంపై నెటిజన్ల సెటైర్లు