యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండువగా జరిగింది. స్వామివారి ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు. అలంకార నరసింహస్వామి వారిని ఆశ్వవాహనంపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామివారి అలంకార సేవోత్సవంలో భాగంగా ఉదయం 9 గంటలకు వివిధ పుప్పాలతో స్వామివారిని జగన్మోహిని అలంకారంలో పెళ్లికుమారుడిగా ముస్తాబు చేసి తిరు మాడ వీధుల్లో ఊరేగించారు.
బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టం ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. తూర్పు రాజగోపురం ఎదురుగా తిరుమాడ వీధుల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో అలంకార నరసింహుడు ఆశ్వవాహనంపై ప్రధానాలయ కల్యాణ మండపం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామివారిని తూర్పు అభిముఖంగా, అమ్మవారిని పశ్చిమ దిశకు అభిముఖంగా ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, రుత్వికులు ఆసీనులై పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
అర్చకులు, వేదపండితులు, అధికారులు స్వామి, అమ్మవార్ల వైపు రెండు జట్లుగా ఏర్పడి ఎదుర్కోలు తంతు నిర్వహించారు. అర్చక బృందం అమ్మవారి అందచందాలు, సుగుణాలను కీర్తించారు. అమ్మవారి వైపున ఆచార్య పురుషులు, నిత్యముక్తులు పాల్గొని అమ్మలేనిది స్వామిలేడు.. స్వామి వారిని లోకానికి పరిచయం చేసింది అమ్మవారే.. అనే అంశాన్ని ఉదాహరణలతో సహా వివరించారు. యాదగిరిగుట్టలో స్వయం భూ లక్ష్మీనారసింహస్వామిగానే భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడన్నారు. పంచనారసింహుడి క్షేత్రంలో స్వా మి అపూర్వమైన అనుగ్రహం లోకాలకు అందిపజేస్తున్నది అమ్మవారేనన్నారు. స్వయం భూ అంటేనే అమ్మవారని అన్నారు. మరోవైపు అర్చక బృందం స్వామి వారి మహిమలు, భక్తజన రక్షణను వివరిస్తూ ఆసక్తికర వాదాలు జరిపారు. స్వామివారి కల్యాణం అమ్మవారితో బుధవారం రాత్రి 9.30 గంటలకు జరిపేందుకు ముహూర్తం నిశ్చయించారు.

ముగ్ధమనోహరంగా..
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవంలో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం రోజున స్వామివారిని ముగ్ధమనోహరంగా జగన్మోహిని అలంకారంలో పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేశారు. జగన్మోహిని అలంకార సేవను ప్రధానాలయ తిరుమాడ వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. పట్టువస్ర్తాలు, బంగారం, వజ్ర వైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలు, వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణికులు ముందు నడుస్తుండగా వీధుల్లో ప్రత్యేక సేవను నిర్వహించారు. మూల మంత్ర జపాలు, స్తోత్రాలు, మంత్రోచ్ఛరణ, ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాశురాలను పఠిస్తూ మంగళవాయిద్యాల మధ్య భక్తులు గోవిందా.. గోవిందా అంటూ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు పాల్గొన్నారు.
నేడు తిరుకల్యాణోత్సవం..
యాదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ముఖ్య ఘట్టమైన తిరుకల్యాణోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్తర మాడ వీధుల్లోని రథశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మించిన కల్యాణ వేదికపై నిర్వహించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ మండపాన్ని రంగురంగుల పూలతో తీర్చిదిద్దారు. మండపం ఎదురుగా భక్తులతో పాటు ఉత్తర మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్‌పై భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. వారికోసం ప్రత్యేకంగా 8 ఎల్ఈడీ స్క్రీన్లను అందుబాటులో ఉంచారు. బ్రహ్మోత్సవాల్లో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నతస్థాయి అధికారులు హాజరుకానున్నారు. ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం తొలిసారిగా జరిగే కల్యాణోత్సవానికి వీవీఐపీల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో పటిష్ట బం దోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 18 మంది ఎస్సైలు, 150 మంది పోలీసు సిబ్బంది, 176 మంది ఇతర సిబ్బందిని ఈ సందర్భంగా నియమిస్తున్నారు.
స్వామివారికి టీటీడీ పట్టువస్ర్తాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించారు. మంగళవారం తితిదే ఏఈవో ముని రత్నం, వేద పండితులు, అర్చక బృందం కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టువస్ర్తాలను ఆలయ ఈవో భవానీశంకర్ అందజేశారు.