Rekha Gupta : అండర్వేర్ మాత్రమే ధరించి మహిళల నుంచి వినతులు స్వీకరించిన ఆప్ ఎమ్మెల్యేపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తులు సరిగ్గా వేసుకోవాలంటూ ఎమ్మెల్యేకు సూచించారు. ఢిల్లీ వాయువ్య ప్రాంతంలోని కిరారి నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అనిల్ ఝా వాత్స్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అతడు తాజాగా తన ఇంటి దగ్గర బయట కుర్చీ, టేబుల్ వేసుకుని కూర్చున్నాడు. ప్రజల దగ్గర నుంచి సమస్యలపై వినతులు స్వీకరించాడు. కొందరు మహిళలు కూడా ఆయనకు వినతి పత్రాలు సమర్పించారు. అయితే, ఇవి స్వీకరించే సమయంలో ఆ ఎమ్మెల్యే ఒక ఫుల్ బనియన్, చిన్న నిక్కరు మాత్రమే ధరించి ఉన్నాడు.
అవి పూర్తిగా లోదుస్తులు. అలాంటి దుస్తులు ధరించి, ఇంటి బయట బహిరంగంగా కూర్చుని ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక ఎమ్మెల్యే ఇలా సరిగ్గా దుస్తులు వేసుకోకుండా ఉండటంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందించారు. ఎమ్మెల్యే సరిగ్గా దుస్తులు వేసుకోవాలని సూచించారు. అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుండగా రేఖా గుప్తా, వారిని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటు. కనీసం మీ దగ్గరికి సంతకాల కోసం మహిళలు వచ్చినప్పుడైనా దుస్తులు సరిగ్గా వేసుకోవాల్సింది. ఒక ఎమ్మెల్యే నుంచి ఇలాంటి అనుచిత ప్రవర్తన సరికాదు. అతడి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’’ అంటూ రేఖా గుప్తా వ్యాఖ్యానించారు.
Meet Aam Aadmi Party’s MLA : Anil Jha Vats!!
> MLA from Kirari Assembly
> Wears Kacha and Baniyan
> Sits outside his home
> Signs documents without even reading them
> Claims to be an MLA from Padhi-Likhi Political Party!! pic.twitter.com/xYozn5liVH
— Rohit (@Iam_Rohit_G) August 10, 2026
అసెంబ్లీ సమయంలో కూడా ఎమ్మెల్యే ప్రవర్తన సరిగ్గా లేదంటూ సీఎం ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు అనుచితంగా ప్రవర్తించానో చూపించాలంటూ సీఎంకు సవాల్ విసిరారు. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై సమాధానం చెప్పలేకే, వారి దృష్టి మళ్లించేందుకు సీఎం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే అనిల్ ఝా విమర్శించారు.