ఆదిలాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ల్లో అధికారదాహం ఏ స్థాయిలో ఉందంటే.. సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు, మంత్రి వివేక్ దురాగతాలకు అధికార యంత్రాంగం తొత్తులుగా మారి ప్రజల తీర్పును అపహాస్యం చేశారని రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌తోపాటు ఇతర నాయకులను ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సంజయ్, గంగుల కమలాకర్, అనిల్ జాద వ్, వివేకానంద, మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్, నాయకు లు గ్యాదరి కిశోర్, కోనే రు కోనప్ప, దుర్గం చిన్నయ్య, జాన్సన్ నాయక్‌లతో కలిసి కేటీఆర్ పరామర్శించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పది స్థానాలు గెలుచుకోగా, తమతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టు ఆఫ్ ఇండియా నాలుగు స్థానాలు సొం తం చేసుకున్నదన్నారు. 22 స్థానాలకు బీఆర్ఎస్ కూటమి 14 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలుచుకున్నదని, మంత్రి అక్రమంగా మున్సిపాలిటీలో పదవులను కైవసం చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. కాంగ్రెస్ నాయకులు దురాగతాలు, దుర్మార్గాలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసినా వెరవకుండా క్యాతనపల్లిలో 14 మంది కౌన్సిలర్లు పొత్తు ధర్మాన్ని వీడలేదని తెలిపారు. కౌన్సిలర్లు భద్రాచలం దర్శనానికి వెళ్తే కాంగ్రెస్ గూండాలు వచ్చి దాడి చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
క్యాతనపల్లి ఎన్నికల సందర్భంగా కౌన్సిల్ హాల్లో బీఆర్ఎస్, సీపీఐ మహిళా కౌన్సిలర్లపై తాగివచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మంత్రి, ఎంపీలు చిద్విలాసంగా నవ్వారే తప్పా.. వారించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఇంత చిల్లర రాజకీయం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని, జనగాంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ చేయిని వెనక ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ చేయిని బలవంతంగా లేపే ప్రయత్నం చేశారని, ప్రజలు తీర్పును కాదని కాంగ్రెస్ పదవుల కోసం పాకులాడుతుందన్నారు.
రూ. 3 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించారు..
సీఎం రేవంత్‌రెడ్డి లేకీ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నా రు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు రూ.3 కోట్ల ఆఫర్లు ఇచ్చారని, నిజాయితీ గల బిడ్డలు కాబట్టి రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చిన, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా మంత్రి వివేక్ ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా లొంగపోలేదన్నారు. మాకు పైసలు వద్దు మా నాయకుడు కేసీఆర్ నాయకత్వం, మా సోదరుడు సుమన్ నాయకత్వంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేస్తామని కౌన్సిలర్లు స్పష్టంగా ముందుకొచ్చారని తెలిపారు. సీసీఐ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు చెబుతున్నానని, పొత్తు ధర్మాన్ని అనుసరించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గకుండా పొత్తు ధర్మాన్ని పాటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వివరించారు.

సుమన్‌కు జైలు కొత్తకాదు..
సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదు. సుమన్ కొత్తగా జైలుకుపోలేదని, తెలంగాణ ఉద్యమంలో పది సార్లు జైలుకు పోయి ఆరు సార్లు జైలులో ఉన్న ఉద్యమకారుడన్నారు. సుమన్‌ను జైలులో పెడితే భయపడుతాడనో, మా నాయకులు భయపడుతారనో మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నాయకులు భయపడుతారనో రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకో మళ్లీ చిప్పకూడు తినే సమయం వస్తుందన్నారు. ఇలాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచివి కావు. ఎన్నికల కమిషన్ క్యాతనపల్లిలో నిజాయితీగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జైలు ఎదుట నిరసన
ఆదిలాబాద్ జైలు ఎదుట బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎంపీ బాల్క సుమన్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ నినాదాలు చేశారు. నాయకులను విడుదలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన కేటీఆర్‌కు బీఆర్ఎస్ నాయకులు మావల వద్ద ఘన స్వాగతం పలికారు. మావల నుంచి జైలు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జైలు వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.
