కోల్కతా: పశ్చిమ బెంగాల్లో చేపడుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. (Mamata Banerjee) పేర్లు తొలగిస్తే వంటగది వస్తువులతో పోరాటానికి మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘సర్’ పేరుతో తల్లులు, సోదరీమణుల హక్కులను లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వారు ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి తల్లులు, సోదరీమణులను బెదిరిస్తారని బీజేపీపై మండిపడ్డారు. ‘బీజేపీనా? మహిళలా? ఎవరు ఎక్కువ శక్తివంతమైనవారో చూడాలనుకుంటున్నా’ అని అన్నారు.
కాగా, తాను మతతత్వాన్ని నమ్మనని, లౌకికవాదాన్ని నమ్ముతానని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ డబ్బు వినియోగించడంతోపాటు ఇతర రాష్ట్రాల వారిని తీసుకువచ్చి బెంగాల్ ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఆదివారం కోల్కతాలో నిర్వహించిన సామూహిక భగవత్ గీతా పారాయణ కార్యక్రమాన్ని విమర్శించారు. ‘ధర్మం అంటే స్వచ్ఛత, మానవత్వం, శాంతి. అంతేగాని హింస, వివక్ష, విభజన కాదు’ అని అన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తులు ప్రజలను విభజించలేదని గుర్తు చేశారు.
మరోవైపు స్వాతంత్ర్యం కోసం పోరాడి, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన బెంగాల్ ప్రజలు తాము భారత పౌరులమని నిరూపించుకోవాలా? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. గాయపడిన పులి ఆరోగ్యకరమైన పులి కంటే క్రూరంగా ఉంటుందని బీజేపీని హెచ్చరించారు. తమపై దాడి చేస్తే ఎలా ప్రతిదాడి చేయాలో తెలుసని చెప్పారు. ‘మీరు ఏం చేసినా సరే. బీహార్ మాదిరిగా బెంగాల్లో జరుగబోదు’ అని అన్నారు.
Also Read:
Man Branded Untouchable | దళిత ఇంట్లో భోజనం చేసిన వ్యక్తి.. ‘అంటరానివాడు’గా ముద్ర, అతడి కుటుంబం వెలి
Watch: మత్తులో యువకులు హంగామా.. స్కూల్ బస్సును అడ్డుకుని బాలికను దించాలని బలవంతం