చండీగఢ్: కూలీ పనులు చేసేకునే దంపతులు రూ.1.5 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో ఎవరైనా తమకు హాని తలపెడతారేమోనని ఆ దంపతులు భయాందోళన చెందారు. (Couple Wins Lottery, Flees Home) తమ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయారు. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సైదేకే గ్రామానికి చెందిన రామ్ సింగ్, నసీబ్ కౌర్ భార్యాభర్తలు. వారిద్దరూ దినసర కూలీకి వ్యవసాయ పనులు చేస్తుంటారు.
కాగా, రామ్ సింగ్ భార్య నసీబ్ కౌర్ ఇటీవల రూ.200కు పంజాబ్ రాష్ట్ర లాటరీ కొనుగోలు చేసింది. అదృష్టం వరించడంతో రూ.1.5 కోట్లు లాటరీలో గెలుచుకున్నది. స్థానికులతో పాటు అందరికి ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో లాటరీ గెలిచామన్న ఆనందం బదులు ఆ దంపతులకు భయం పట్టుకున్నది. లాటరీ డబ్బు కోసం ఎవరైనా తమను బెదిరిస్తారేమో, తమకు హాని తలపెడతారేమోనని వారు ఆందోళన చెందారు. దీంతో తమ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి రహస్య ప్రాంతానికి పారిపోయారు.
మరోవైపు పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో రామ్ సింగ్, నసీబ్ కౌర్ దంపతులను వారు సంప్రదించారు. ఎలాంటి భయాందోళన అవసరం లేదని వారి ఇంటికి తిరిగి రావాలని కోరారు. ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తామని పోలీస్ అధికారి భరోసా ఇచ్చారు.