భోపాల్: దళిత ఇంట్లో జరిగిన వేడుకలో ఒక వ్యక్తి పాల్గొన్ని భోజనం చేశాడు. ఈ నేరానికి ప్రాయశ్చిత్తం చేయాలని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. అతడు పాటించకపోవడంతో ‘అంటరానివాడు’గా ముద్ర వేశారు. (Man Branded Untouchable) అలాగే ఆ వ్యక్తి కుటుంబాన్ని వెలి వేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. రైసేన్ జిల్లాలోని పిపారియా పుయారియా గ్రామానికి చెందిన దళితుడైన సంతోష్ పరోల్ ఇంట్లో ఒక ఆచారం జరిగింది. స్నేహితులైన మనోజ్ పటేల్, ఉపాధ్యాయుడు సత్యేంద్ర రఘువంశీతో కలిసి భరత్ రాజ్ ధకడ్ ఆ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆ దళిత ఇంట్లో వారు భోజనం చేశారు.
కాగా, టీచర్ సత్యేంద్ర దీనిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్ కావడంతో గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సర్పంచ్ భగవాన్ సింగ్ పటేల్ నేతృత్వంలో పంచాయితీ సమావేశం నిర్వహించారు. దళిత వ్యక్తి ఇంట్లో భోజనం చేసిన మనోజ్ పటేల్, సత్యేంద్ర రఘువంశీ, భరత్ రాజ్ ధకడ్ సామాజిక నేరానికి పాల్పడినట్లు డిక్రీ జారీ చేశారు. ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో స్నానమాచరించి శుద్ధి చేసుకోవాలని, సమాజానికి విందు ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఒత్తిడి వల్ల మనోజ్ పటేల్, సత్యేంద్ర రఘువంశీ ఆ కర్మలను ఆచరించారు.
మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన భరత్ రాజ్ ధకడ్ దీనికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ‘అంటరానివాడు’గా ఆ గ్రామం ముద్ర వేసింది. అలాగే భరత్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించారు. ఆయన తండ్రి నిరంజన్ సింగ్ను గ్రామంలో జరిగే వేడుకలకు ఆహ్వానించడం లేదు. ఆయన కుటుంబంతో మాట్లాడేందుకు గ్రామస్తులు నిరాకరించారు.
కాగా, భరత్ రాజ్ కుటుంబం ప్రతిరోజూ అవమానంతో పాటు వివక్షను ఎదుర్కొంటోంది. దీంతో పోలీసులకు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)కు అతడు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారులు స్పందించలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని భరత్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ విశ్వకర్మ సమక్షంలో జరిగిన ప్రజా విచారణ సందర్భంగా మరోసారి అతడు ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ ఇలాంటి వివక్షను సహించబోమని అన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అతడికి హామీ ఇచ్చారు.
Also Read:
Police Kidnap Student | విద్యార్థిని కిడ్నాప్ చేసి.. నకిలీ డ్రగ్స్ కేసులో ఇరిగించిన పోలీసులు
Watch: పులి వేషంలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే.. ఎందుకంటే?