అగ్ర హీరో మహేష్‌బాబు జార్జియా పయనమయ్యారు. గురువారం నుంచి ‘వారణాసి’ సినిమాకు చెందిన భారీ షెడ్యూల్ అక్కడ మొదలుకానుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు సైతం ఈ షెడ్యూల్లో భాగం కానున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నాటికి పూర్తికానున్నట్టు, సెప్టెంబర్ నుంచి నేపథ్య సంగీతానికి చెందిన పనులు మొదలుకానున్నట్టు చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇటీవలే వెల్లడించారు. ఇక దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.. తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాను త్వరగానే పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
పురాణ, ఇతిహాసాల మేళవింపుగా సాగే పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో మహేష్ కొన్ని నిమిషాల పాటు శ్రీరాముడిగా కనిపిస్తారు. ఆ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు రాజమౌళి ఇటీవల నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ వేడుకలో వెల్లడించారు. శ్రీరాముడు, మహాశివుడు, వారణాసి క్షేత్రం, సమకాలీన ప్రపంచం.. తదితర అంశాల మేళవింపుగా సినిమా ఉంటుదని సమాచారం. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మాతలు.