ముంబై, ఫిబ్రవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో మున్ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కుదేలవుతుందన్న భయాలు మదుపరులను వెంటాడాయి. అలాగే వాణిజ్యపరంగా అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆందోళనలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చాయి. ఈ క్రమంలోనే ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నాయి.
ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు లేదా 1.28 శాతం పడిపోయి 82,225.92 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 1,359.93 పాయింట్లు లేదా 1.63 శాతం క్షీణించడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 288.35 పాయింట్లు లేదా 1.12 శాతం దిగజారి 25,424.65 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో 385.40 పాయింట్లు పతనమైంది. దీంతో వరుస రెండు రోజుల లాభాలకు తెరపడినైట్టెంది.
ఐటీ రంగ షేర్లు సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొన్నాయి. టెక్ మహీంద్రా షేర్ విలువ అత్యధికంగా 6.6 శాతం క్షీణించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లూ తీవ్రంగానే నిరాశపర్చాయి. అలాగే ఎల్అండ్టీ, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లూ నష్టాలనే మిగిల్చాయి. దీంతో ఎన్టీపీసీ, హిందుస్థాన్ యునీలివర్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ముగిసినా ఫలితం లేకపోయింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.54 శాతం పడిపోయాయి. రంగాలవారీగా ఐటీ 4.80 శాతం పతనమైంది. రియల్టీ 2.61 శాతం, టెలికాం 1.79 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.12 శాతం, ఇండస్ట్రియల్స్ 0.91 శాతం మేర నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా ప్రధాన సూచీల్లో దక్షిణ కొరియా, షాంఘై, జపాన్ లాభాల్లో ముగిశాయి. హాంకాంగ్ సూచీ మాత్రం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రధాన సూచీలు 0.27 శాతం మేరకు క్షీణించాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం.. గ్లోబల్ ఇన్వెస్టర్లను కలవరపెడు
తున్నదని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.రూపాయి 6 పైసలు క్షీణత రూపాయి విలువ మరింత పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 6 పైసలు తగ్గి 90.95కి జారుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం వల్లనే రూపాయి ఒత్తిడికి గురైందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.