తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట గడ్డపై పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని, అందుకే పోలీసులను ఉసిగొలిపి అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారని ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రే వ్యవహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకోవద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలు విధించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర పాలన నాటి కర్కశత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.
శాసనసభ విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరినీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను విగ్రహ తొలగింపు వంటి తుగ్లక్ చేష్టలతో వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదని సూచించారు. అలాగే, ముమ్మాటికి రాష్ట్రంలో ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టుకోవటమే కాకుండా ఆయన వీరోచిత పోరాటానికి శాశ్వత కీర్తిని తెస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.