హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల హామీలను గాలికొదిలి, ఉద్యోగులను వంచించిన కాంగ్రెస్ సరార్ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని, పీఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నూతన వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచినా ఆ హామీల ఊసే ఎత్తకపోవడం ఉద్యోగ లోకాన్ని నిలువునా మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజాపాలన అంటూనే ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల గొంతు నొకేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆరు గ్యారెంటీలతోపాటు ఉద్యోగుల ప్రాథమిక సమస్యలను మూడేండ్లుగా పరిషరించకుండా పెండింగ్‌లో పెట్టి, ఇప్పుడు మరో రెండేండ్లపాటు ఎలాంటి డిమాండ్లు చేయొద్దని చెప్పడం ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి అద్దం పడుతున్నదని దుయ్యబట్టారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్థాయిలో ఆరు కరువు భత్యం(డీఏ) బకాయిలను నిలిపివేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆవేదన వ్యక్తంచేశారు.
డీఏలను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని వాపోయారు. నాలుగు నెలలుగా ఎంప్లాయీస్ హెల్త్ సీమ్ పేరిట క్రమం తప్పకుండా డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎవరికీ కొత్త హెల్త్ కార్డులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు సరైన కార్పొరేట్ వైద్య సదుపాయం అందక ప్రాణాలు కోల్పోతున్న దురదృష్టకర పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసు సిబ్బందికి రావలసిన ట్రావెలింగ్ అలవెన్స్(టీఏ), డీఏ, రిస్ అలవెన్స్‌లను సైతం విడుదల చేయకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నదని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. హోంగార్డులు, కాంట్రాక్టు సిబ్బంది దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారని, ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఏండ్ల తరబడి బకాయి పెట్టారని మండిపడ్డారు. ఆశా వరర్లపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేయించడం నిరంకుశ పాలనకు పరాకాష్ట అని నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ పాలనలో 42% ఫిట్మెంట్తో మొదలుపెట్టి మొత్తం 75% వరకు ఫిట్మెంట్ అందించి ఉద్యోగులను గౌరవించామని శ్రీనివా స్ గౌడ్ గుర్తుచేశారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, గతంలో జరిగిన చిన్నచిన్న లోపాల ను సరిదిద్దుకొని ఉద్యోగులకు ప్ర భుత్వం నుం చి రావాల్సిన అన్ని బకాయిలు, హకులు, ప్ర యోజనాలను బాజాప్తా ఇప్పిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నేత భుజంగరావు పాల్గొన్నారు.