హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా, దురుసుగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని రాష్ట్ర హైకోర్టు మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నదని, అయితే ఎమ్మెల్యేలతో అనుచితంగా ప్రవర్తించడం భావ్యం కాదన్నది. ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాల్సిందేనని, అయితే ఈ ఘటన అసెంబ్లీ ఆవరణలో జరిగి ఉంటే వివరాలను స్పీకర్‌కు ఇవ్వాలని, అసెంబ్లీ ఆవరణ వెలుపల జరిగి ఉంటే హైకోర్టుకు నివేదించాలని డీజీపీని ఆదేశించింది. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉన్నదనే నిబంధనలను గుర్తుచేసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే, వాళ్లను బీఆర్ఎస్ భవన్‌కు ఎందుకు తీసుకువెళ్లారని ప్రశ్నించింది.
వారిని స్పీకర్ ముందు హాజరుపర్చాల్సిందని అభిప్రాయపడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే నినాదాలున్న నల్ల టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మెడ పట్టుకొని గెంటివేయడం, మరో మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీర లాగడం వంటి దారుణాలకు ఒడిగట్టారని, మగ పోలీసులే దౌర్జన్యాలకు పాల్పడ్డారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించలేదంటూ బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపి.. బాధ్యులైన పోలీసులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఈ నెల 7న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, వీటిని రద్దు చేయాలంటూ సిటీ పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై గతంలో వాదప్రతివాదనలు పూర్తికాగా, జస్టిస్ మాధవీదేవి మంగళవారం తాజా ఆదేశాలు జారీ చేశారు. గత ఉత్తర్వులను పాక్షికంగా సవరించారు.
ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాల్సిందేనని ధర్మాసనం మరోసారి తేల్చిచెప్పింది. దీనికన్నా ముందు ఈ ఘటన ఎక్కడ జరిగిందో నిర్ధారించాలని సూచించింది. రూల్-316 ప్రకారం అసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు, కరపత్రాల పంపిణీ, సమావేశాలు, ప్రదర్శనలు, పికెటింగ్, ధర్నాలు నిర్వహించరాదని గుర్తుచేసింది. రూల్-2(క్యూ) నిబంధన ప్రకారం అసెంబ్లీ భవనం, లాబీలు, గ్యాలరీలు, శాసనసభ కార్యాలయాలు, పార్టీలకు కేటాయించిన గదులు, వాటికి వెళ్లే మార్గాలు, ఇనుప కంచె పరిధిలోని బహిరంగ ప్రదేశాలు మొదలైనవి అసెంబ్లీ ప్రాంగణం పరిధిలోకి వస్తాయని పేర్కొన్నది.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఘటన అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద జరుగడంతో, అది ప్రాంగణంలో భాగమా, అసెంబ్లీ వెలుపలా అన్నది ఇంకా నిర్ధారించాల్సి ఉన్నదని తెలిపింది. ఎమ్మెల్యేలను గేటు వద్దే అడ్డుకున్నారా? లేక గేటులోకి ప్రవేశించిన తర్వాత అడ్డుకున్నారా? అన్నది వాస్తవాల ఆధారంగా తేలాల్సి ఉన్నదని స్పష్టంచేసింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని బట్టి వివరాలను సమర్పించాలని న్యాయమూర్తి సూచించారు. అసెంబ్లీ గేటు లోపల జరిగి ఉంటే ఆ వివరాలను స్పీకర్‌కు అందించాలని డీజీపీని ఆదేశించారు. అసెంబ్లీ ప్రాంగణం వెలుపల ఈ ఘటన జరిగి ఉంటే వివరాలు కోర్టుకు నివేదించాలన్నారు.
ఎమ్మెల్యేలపై పోలీసుల చర్యలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నా, శాసనసభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదని తేల్చి చెప్పింది. స్పీకర్ ఆదేశాల మేరకే పోలీసులు వారిని అడ్డుకున్నారా? అని ప్రశ్నించింది. ఒకవేళ అదే జరిగితే స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని స్పష్టంచేసింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులను స్పీకర్ ముందు హాజరుపరచాల్సి ఉండేదన్న పిటిషనర్ల అభిప్రాయాలను గుర్తుచేసింది. స్పీకర్ ఆదేశాలను ఉల్లంఘించని, నినాదాలు లేని చీరలు ధరించిన మహిళా ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ భవన్‌కు ఎందుకు తరలించారో ప్రభుత్వం వివరించలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
అసెంబ్లీ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో సమావేశాలు, ఊరేగింపులు, బహిరంగ కార్యక్రమాలను నిషేధిస్తూ నగర పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యేందుకు వెళ్లడాన్ని నిషేధించేవి కావని గుర్తుచేసింది. ఈ నిషేధాజ్ఞలను ఎమ్మెల్యేలు ఉల్లంఘించినట్టు ఎఫ్ఐఆర్లో ప్రస్తావన లేదని కోర్టు గుర్తించింది. రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ రాజకీయ పార్టీ దాఖలు చేసిందా? లేక బీఆర్ఎస్ శాసనసభా పక్షం దాఖలు చేసిందా? ఈ పిటిషన్ దాఖలు చేసే హకు ఉన్నదా? అనే అంశాల ను తుది విచారణలో నిర్ణయిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. తదుపరి విచారణను వా యిదా వేసింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదించారు.