హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రతిష్టను దిగజార్చేందుకు సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్, డీప్‌ఫేక్ ఏఐ వీడియోలు, ఫొటోలు తయారుచేసి, ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వికృత ప్రచారంపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ ఆఫీసులో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్‌కు శాసనమండలి విపక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితం తెలంగాణ శాసనసభ ఎదుట బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై జరిగిన భౌతిక దాడులు, దౌర్జన్యాల ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ఘటనపై జవాబుదారీతనం వహించకుండా, తమ నేతలపైనే దుష్ప్రచారం చేసేందుకు డిజిటల్ కంటెంట్‌ను సృష్టిస్తున్నారని తెలిపారు. దీంతోపాటు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపట్ల అసభ్యంగా ప్రవర్తించి అడ్డుకున్న పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని మహేశ్ భగవత్‌ను కోరారు. కేసీఆర్ చావాలంటూ వికృతంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీ శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేసినా కేసు ఫైల్ చేయడం లేదని, ఎఫ్ఐఆర్లు నమోదు కావడం లేదని డీజీ దృష్టికి తీసుకొచ్చారు. కేసీఆర్ నివాసంపై దాడికి దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లు, కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హామీ ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడి నుంచి దృష్టి మరల్చేందుకే సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. డీజీపీ ఆఫీసు నుంచి వచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు, ఏఐ చిత్రాలు, దుష్ప్రచార కంటెంట్‌ను విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చావుకోరిన వీర్లపల్లి శంకర్‌పై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళ నాయకురాళ్లతో వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. బాధ్యులైన పోలీసులు, అధికారులపై కేసు నమోదు చేయాలని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో ప్రతిపక్షం లేకుండా తమను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత గర్హనీయమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఏఐ, మార్ఫింగ్ ఫొటోలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని చెప్పారు. తామే తమ మహిళా ఎమ్మెల్యేలను వెనుకనుంచి నెట్టామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. పోలీసులే గుంపులుగా వెనుకనుంచి తమను తోశారని తెలిపారు. బాధ్యులను తప్పించేందుకు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏఐ వీడియోలు విడుదల చేయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపగాని రఘరామ్, బండారి వీరబాబు పాల్గొన్నారు.