KTR The Paradise | నేచురల్ స్టార్ నాని, ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద ఘన విజయంతో దూసుకుపోతోంది. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే విపరీతమైన పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఆధారంగా రూపొందించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ (ప్రియదర్శి) క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ చిత్రంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశారు.
చాలా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను థియేటర్‌కు వెళ్లి ఒక సినిమా చూడబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన నాని, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఈ రాత్రి థియేటర్లో చూడబోతున్నానని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నాని అభిమానులతో పాటు సినీ, రాజకీయ వర్గాల్లోనూ ఈ పోస్ట్ ఆసక్తికర చర్చకు దారితీసింది.