హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘వాట్సాప్ పోరాటాలు ఇంకెతకాలం.. రోడ్డు మీదికి రారా? అని రెచ్చగొట్టారు. మమ్మల్ని ఇంకెంతకాలం ప్రశ్నిస్తారు. బరిలోకి దిగండి.. అంటూ పిలుపునిచ్చారు. జిల్లాలన్నీ తిరిగి సన్నాహక సభలు పెట్టారు. ‘జబ్బకు సంచి చేతిలో జేఏసీ జెండాతో దండు కట్టండి’ అంటూ సమాయత్తం చేశారు. 10వ తేదీన వస్తారా? పీఆర్సీ, డీఏల కోసం ఇంకా రెండేండ్లు వేచిచూస్తారా? అంటూ రెచ్చగొట్టారు. తీరా అంతా సిద్ధమై ‘చలో హైదరాబాద్’కు సిద్ధమయ్యాక ఇప్పుడు హక్కుల సాధన సభ వాయిదా అంటూ ఉసూరుమనించారు. కోతలెన్నో కోశారు..
చప్పున చల్లబడ్డారు..’ ఇదీ ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తంచేసిన ఆవేదన. ఇది ఆ ఒక్కరి ఆవేదనే కాదు. రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆక్రందన. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ జేఏసీ గురువారం నిర్వహించ తలపెట్టిన ఉద్యోగుల హక్కుల సాధన సభను జేఏసీ వాయిదా వేసింది. దీంతో ఉద్యోగులు, టీచర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జేఏసీ నాయకత్వాన్ని సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. వారి వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ నాయకత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో తూర్పారబడుతున్నారు.
ఒకరోజు ముందే ఎలా వాయిదా వేస్తరు?
జేఏసీ నాయకత్వం దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. జిల్లాల పర్యటనలు, సమావేశాలతో ఉద్యోగుల్లో ఉద్యమ వాతావరణాన్ని రగిలించింది. ఈ ధర్నాలో పాల్గొని గర్వపడుతావా? లేక ఒక క్యాజువల్ లీవ్ కోసం చరిత్రలో నిస్సహాయుడిగా ఉండిపోతావో నిర్ణయించుకో? అంటూ టీచర్లను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రెచ్చగొట్టాయి. కొందరు సెలవులు పెట్టుకోగా, మరికొందరు ముందస్తు ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కార్లు, బస్సులను బుక్ చేసుకున్నారు. ఇక ఉద్యమం ఆగదు. చర్చలకు వెళ్లబోమని తెగేసి చెప్పారు. తీరా ఒకరోజు ముందు వాయిదా వేయడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
జేఏసీలో భగ్గుమన్న విభేదాలు
హక్కుల సాధన సభను వాయిదావేయడంపై జేఏసీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. జేఏసీ అత్యవసర సమావేశంలో ఈ విభేదాలు బట్టబయలయ్యాయి. ఉద్యమాన్ని కొనసాగించాలని కొందరు పట్టుబట్టారు. ఇక చర్చలకు కొందరిని మాత్రమే తీసుకెళ్లారు. సభ్య సంఘాలైన తమకు ఎందుకు సమాచారమివ్వలేదంటూ ఓ ఉపాధ్యాయ సంఘం నేత జేఏసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రా్రష్ట్రంలో 13 లక్షల ఉద్యోగ, పెన్షనర్లు ఉన్నారు. వారి ఆశలను వమ్ముచేసే నిర్ణయం తీసుకోవద్దని ఓ మహిళా నేత నాయకత్వాన్ని అభ్యర్థించారు.
ఇప్పటికే మూడుసార్లు ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చి మూడుసార్లు వాయిదా వేసుకున్నామని, ఇక మనల్ని ఉద్యోగులు నమ్మరన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని మరో నేత హెచ్చరించారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నదని, వాట్సాప్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతున్నదని, మన పరిస్థితి 64 డిమాండ్ల నుంచి నాలుగు డిమాండ్లకు వచ్చిందని, ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరో నేత జేఏసీ నాయకత్వాన్ని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని, రాజకీయ నిర్ణయం కాకుండా అధికారుల నిర్ణయాన్ని నమ్మితే ఎలా? అని, సీఎస్ ఇచ్చే హామీ అమలువుతుందా? ఇప్పుడున్న సీఎస్ రేపు వెళ్లిపోతే మన సంగతేంది అంటూ అన్ని వర్గాల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
‘ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి’
ఎంప్లాయీస్ జేఏసీలోని ఐదు సంఘాల ప్రతినిధులు సభ వాయిదాకు ఒప్పుకోలేదని సమాచారం. ఇదే విషయాన్ని జేఏసీ నాయకత్వానికి వారు తెగేసి చెప్పగా.. తీవ్రస్వరంతో ఇతర నేతలు హెచ్చరించినట్టు సమాచారం. ‘మీరేమైనా మొనగాళ్లా.. పీకుడుగాళ్లా.. మీరెంత? మీ సభ్యత్వమెంత? అంటూ గొంతునొక్కినట్టు సమాచారం. కావాలంటే మీరే సభ పెట్టండి.. మేం డబ్బులు కట్టి గ్రౌండ్ ఇప్పిస్తాం. భోజనాలు పెట్టిస్తాం. ఎంత మందిని తీసుకొస్తారో చూసుకుందాం?
మేమే ఇరగదీస్తున్నాం.. పొడుస్తున్నాం అనుకుంటే పొరపాటు. రాతపూర్వక హామీకి ఒప్పుకోమంటే ఎట్లా? మిమ్మల్ని భుజానికెత్తుకుని చెప్పాల్నా ఏంది? అంటూ కస్సుమన్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. జేఏసీ నేతలను సర్కార్ చర్చలకు పిలువలేదని జేఏసీ నేతలే ఎగేసుకొనిపోయారని సమాచారం. సర్కార్ వద్ద మార్కులు కొట్టేయాలన్న తాపత్రయంతో ప్రభుత్వం చర్చలకు పిలువకున్నా, హక్కుల సాధన సభకు అనుమతి కోసం సీఎస్ వద్దకు వెళ్దామంటూ తోడ్కొని వెళ్లి తీరా చర్చలంటూ ప్రస్తావించినట్టు జేఏసీ నేతల్లోనే ప్రచారం జరుగుతున్నది. కొందరు జేఏసీ నేతలను సర్కార్ పెద్దలు భయపెట్టారని, దీంతోనే చర్చలంటూ వెళ్లి సభను వాయిదా వేయించుకున్నట్టు కొందరు జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రశ్నలవర్షం