అసమర్థత కారణంగా ఇప్పటికే అన్నదాతలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోగా, త్వరలో నిండా మునిగిపోనున్నారు. 22ఏ జాబితా వివాదం ముగిసిపోయిందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇది మరింత తీవ్రరూపం దాల్చి రైతులను నిండా ముంచనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో వ్యవసాయమే కుంటుపడే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నిషేధిత జాబితాలో ఉన్న వ్యవసాయ భూములకు యూరియా పంపిణీ, రైతుభరోసా పెట్టుబడి సాయం నిలిచిపోనున్నట్టు చెప్తున్నారు. ఆ తర్వాత రైతులకు పంట రుణాలు కూడా బంద్ అవుతాయని అంటున్నారు. భూములు నిషేధిత జాబితాలో ఉంటాయి కాబట్టి బ్యాంకులు రుణాలు మంజూరు చేయవని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఆయా రైతుల జీవితాలు రోడ్డునపడే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
22ఏ నిషేధిత భూముల వివాదానికి సంబంధించి సమీప భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వే చేసి, ప్రభుత్వానికి రహస్య నివేదిక అందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికలో సమస్య ఎక్కడ, ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? దీని పర్యవసానాలు ఏమిటి? వంటి అనేక కీలక అంశాలను పొందుపరిచినట్టు తెలిసింది. కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి విచారణ, వివరణ లేకుండా కోటి ఎకరాల భూములను 22-ఏ నిషేధిత జాబితాలో పెట్టిన విషయం తెలిసిందే.
తప్పు జరిగిందని, క్షమించాలని స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిశ్రీనివాస్రెడ్డి అంగీకరించా రు. వ్యవసాయ భూములకు సంబంధించి 22-ఏ జాబితా పర్యవసానాలు ప్రస్తుతానికి ఏమీ లేనట్టు కనిపిస్తున్నది. యాసంగి నుంచి అసలు కథ మొదలవుతుందని సమాచారం. యాసంగిలో 22-ఏ నిషేధిత జాబితాలోని వ్యవసా య భూములకు పథకాలు బంద్ కానున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆయా భూముల్లో వేసిన పంటలకు యూరియాతోపాటు ఇతర ఎరువుల పంపిణీని నిలిపివేస్తారని ప్రచారం జరుగుతున్నది. రైతుభరోసా కూడా బంద్ కానున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే నిషేధిత జాబితాలోని భూముల అమ్మకా లు, కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ప్రతి సీజన్లో రెవెన్యూ శాఖ నుంచి వ్యవసా య శాఖకు భూముల జాబితా వస్తుంది. ఆ జాబితా ప్రకారమే వ్యవసాయ శాఖ యూరియా పంపిణీతోపాటు రైతుభరోసా అందజేస్తుంది. పంట కొనుగోళ్లకు కూడా ఈ జాబితానే ఆధారం. ఇప్పటివరకు ఉన్న జాబితాను 22-ఏ వివాదం మొదలవక ముందు తీసుకున్నారు. దీంతో ఆ భూములకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందిరాలేదు. ఇప్పుడు యాసంగి కోసం కొత్తగా జాబితా తీసుకోనున్నారు. కొత్తగా సవరించిన 22-ఏ భూ ములు కూడా చేరనున్నాయి. దీంతో ఆ భూములను ప్రభుత్వ పథకాలకు పరిగణనలోకి తీసుకొనే అవకాశం లేదని తెలిసింది. వ్యవసాయశాఖ పోర్టల్లో నిషేధిత జాబితాలోని భూములు కనిపించవని చెప్తున్నారు.
పంటల కొనుగోళ్లూ బంద్
నిషేధిత జాబితాలోని భూముల్లో రైతులు పంటలను సైతం అమ్ముకోలేని దుస్థితి ఏర్పడనున్నదని నిపుణులు హె చ్చరిస్తున్నారు. 22-ఏ జాబితాలోని భూములకు యూరియా పంపిణీ, రైతుభరోసా నిలిపివేతతో ఆగిపోరని, ఆ భూ ముల్లో పండించిన పంటలను సైతం కొ నుగోలు చేయడం కష్టమేనని తెలిసింది. రైతుభరోసా ఇవ్వకపోయినా అప్పో సప్పో తెచ్చి పంటలు పండించినా, రైతు లు ఆ పంటలు అమ్ముకోలేరు. పంటల కొనుగోళ్ల పోర్టల్లో ఆ భూముల వివరాలు నమోదు కాకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. పంటల కొనుగోళ్ల వెబ్సైట్లో భూముల వివరాలు నమోదైతేనే అధికారులు పంటలను కొనుగోలు చేస్తారు. నిషేధిత జాబితాలో ఉన్న కారణంగా ఆ భూములు పంటల కొనుగోళ్ల వెబ్సైట్లో కనిపించే అవకాశం ఉండదు. దీంతో రైతులు తమ ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినా, అధికారులు కొనుగోలుకు నిరాకరించే అవకాశం ఉన్నది.
వ్యవసాయ సంక్షోభం
భూమి లేకుండా రైతు లేడు.. రైతు లేకుండా పంట లేదు. అలాంటి వీటి మధ్య కాంగ్రెస్ సర్కార్ 22-ఏ పేరుతో చిచ్చు పెట్టింది. ప్రభుత్వ పెద్దల కుట్రల్లో భాగంగా పురుడుపోసుకున్న నిషేధిత జాబితా వివాదం రాష్ట్ర వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉన్నదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను ఈ జాబితాలో పెట్టడంతో రైతుల బతుకులు ఆగమయ్యే ప్రమాదం ఉన్నది. నిషేధిత భూములకు యూరియా పంపిణీ, రైతుభరోసా, పంట కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు.
ఇదే జరిగితే రాష్ట్రం బీడుగా మారే ప్రమాదం పొంచి ఉన్నది. అంతేకాదు.. ఈ ప్రభావం రాష్ట్రంలో ఆహార సంక్షోభానికి దారి తీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కండ్ల ముందు భూమి ఉన్నా.. రైతులు పంటలు పండించలేని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని, వారి బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.