విరోష్..ఇప్పుడీ పేరు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీకి అభిమానులు ప్రేమగా విరోష్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అభిమానుల నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ పెళ్లికి ‘విరోష్ వెడ్డింగ్’ అనే పేరును ఫిక్స్ చేశామని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రెండు రోజుల క్రితం సోషల్‌మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నెల 26న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కబోతున్నారు.
ఇప్పటికే విజయ్-రష్మిక కుటుంబ సభ్యులతో కలిసి ఉదయ్‌పూర్ చేరుకున్నారు. మంగళవారం నుంచి పెళ్లి ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. అదే రోజు సంగీత్, మెహందీ వేడుక.. బుధవారం నాడు హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారని సమాచారం. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్ పెళ్లికి వేదికగా నిర్ణయించారని సమాచారం. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు పెళ్లికి హాజరవుతారని తెలిసింది.