Ravula Sridhar Reddy | ప్రభుత్వ హాస్టళ్లకు బెడ్స్ సప్లయ్‌లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. రూ.16 వేలకు వచ్చే యూనిట్‌కు రూ.33 వేలు ధర నిర్ణయించారని అన్నారు. రూ.70 కోట్లతో వచ్చే మెటీరియల్‌కు రూ.170 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్న శాఖలోనే వందల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. దీనికి విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ హాస్టళ్లలో బెడ్స్ సప్లయ్‌కు సంబంధించిన టెండర్ల తీరుపై తెలంగాణ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ కోర్టుకు వెళ్లిందని రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ఎంత ధరకు బెడ్స్ వస్తాయో అధ్యయనం చేయకుండానే టెండర్లు పిలిచారని ఆరోపించిందని పేర్కొన్నారు. అర్హత లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని అసోసియేషన్ పేర్కొందని చెప్పారు. అగ్రిమెంట్ అయిన 120 రోజుల్లోనే సప్లయ్ చేయాలని టెండర్ నిబంధనలు ఉన్నాయని వివరించారు. కానీ అధికారులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అన్నారు.
తెలంగాణ పారిశ్రామికవేత్తల హక్కులను కాలరాస్తున్నారని రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. వేల కోట్ల ఇరిగేషన్, మైనింగ్ కాంట్రాక్ట్‌లను పెద్ద కాంట్రాక్టర్ల చేతిలో పెడుతున్నారని తెలిపారు. రూ.170 కోట్ల కాంట్రాక్టును దక్కించుకునేందుకు తెలంగాణ కాంట్రాక్టర్లు అర్హులు కాదా అని ప్రశ్నించారు. ఓపెన్ టెండ్లర పేరుతో తన్నుకుపోతే చిన్న కాంట్రాక్టర్లు ఎలా బతకాలని నిలదీశారు.