పాట్నా, మార్చి 5: జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. రికార్డు స్థాయిలో 2005 నుంచి 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ త్వరలో బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో బీహార్‌లో మొదటిసారిగా బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. అధికార ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ పొత్తు ధర్మం పాటిస్తూ నితీశ్‌ను సీఎం పదవిలో కొనసాగించింది.
ఇటు విధానసభలో, అటు పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో సభ్యునిగా ఉండాలని మొదటి నుంచీ కోరుకున్నానని నితీశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి తన సహకారం, మార్గదర్శనం తప్పక ఉంటాయని తెలిపారు.
బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నితీశ్‌తోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మరో ముగ్గురు ఎన్డీయే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికలకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఐదు సీట్లూ ఎన్డీయేకే దక్కే అవకాశం ఉన్నది. ఎన్డీయే నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న వారిలో కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), ఆర్ఎల్ఎం అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివేశ్ కుమార్ ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పరిశ్రమల మంత్రి దిలీప్ జైస్వాల్, రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ చౌదరిలో ఎవరో ఒకరు సీఎం పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జేడీయూ కూడా నితీశ్ వారసుడిగా ఆయన కుమారుడు నిషాంత్‌ను ప్రభుత్వంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది.