– ఆగస్టు 6 నుంచి 12 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం
– ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
– ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నల్లగొండ, ఆగస్టు 03 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 12 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. సోమవారం నల్లగొండలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతులు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న లోపాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడమే ఈ యాత్రల ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని యాత్రలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని కోరారు.
నల్లగొండ జిల్లాలో దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితేనే సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నిర్ణీత గడువులోగా వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయని, బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టం పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు నల్పరాజు రామలింగయ్య అధ్యక్షత వహించగా సినియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరి రావు, పబ్బు వీరస్వామి, ఆర్ అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సిపిఐ రూపొందించిన బద్రావ్ జరూరీ హై-మార్పు కావాలి వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ప్రజా చైతన్య యాత్రలు