లక్నో, సెప్టెంబర్ 24 : భర్తను వదిలి వెళ్లిపోయిందనే కారణంతో విడాకులు మంజూరు అయినప్పటికీ విడాకులు పొందిన మహిళ తాను తిరిగి వివాహం చేసుకోకుండా, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే తన మాజీ భర్త నుంచి భరణం కోరవచ్చని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పునిచ్చింది. తన భరణం అభ్యర్థనను తిరస్కరిస్తూ సుల్తాన్పూర్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సునీత దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను అనుమతిస్తూ జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళ 2009లో సీఆర్పీసీ సెక్షన్ 125 కింద భరణం కోసం కేసు దాఖలు చేశారు. ఆమె తనను వదిలి వెళ్లిపోయిందని, తనతో కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదని భర్త పేర్కొన్నారు.
తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందనే కారణంతో 2014లో ఆమె భర్త ఏకపక్ష విడాకుల డిక్రీని పొందాడు. ఆ తర్వాత అతను పునర్వివాహం చేసుకున్నాడు. దీనిపై ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ విడాకులు పొందిన మహిళను భార్యగానే పరిగణించడం కొనసాగుతుందని పేర్కొంది. కేవలం వదిలివెళ్లిపోయిందనే కారణంతో విడాకులు మంజూరు అయినంత మాత్రాన ఆమె అభ్యర్థనను తిరస్కరించలేమని ధర్మాసనం పేర్కొంది. విడాకులు తీసుకున్న మహిళ పునర్వివాహం చేసుకునే వరకు లేదా తన సొంత సంపాదనతో తనను తాను పోషించుకోగలిగే సామర్థ్యం పొందేవరకు భరణం పొందేందుకు అర్హురాలని స్పష్టం చేసింది.