న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆ దేశాల్లో జరగాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమాసియాలో ఉన్న బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల్లో మార్చి 7 నుంచి 11 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే అంతకుముందు మార్చి 2, మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సి ఉండి, వాయిదా పడిన పరీక్షలను కూడా రద్దు చేసినట్టు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్చి 7వ తేదీన జరగాల్సిన 12వ తరగతి పరీక్ష వాయిదా పడిందని తెలిపింది. అంతకుముందే మార్చి 2, 5, తేదీల్లో జరగాల్సిన పరీక్షలను బోర్డు ఇప్పటికే వాయిదా వేసింది.