Kondapur | కొండాపూర్: కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటుంది ప్రభుత్వం. కానీ కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని ఆసత్రికి (Hospital) వచ్చే రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదేదో మారుమూల పల్లెటూర్లో ఉన్న దవాఖాన కాదు. ఇది రాష్ట్ర రాజధాని కొండాపూర్లో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన దుస్థితి. ఆస్పత్రి సమస్యలు విలయతాండవం చేస్తున్నా పట్టించకునేవారే లేరు పేషెంట్లు, కేర్ టేకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటిగా చెప్పుకునే ఈ దవాఖానలో నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో అత్యవసర సేవలు సైతం స్తంభించే పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సిన జనరేటర్ కూడా పనిచేయడం లేదు. సోలార్ విద్యుత్ ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో కొన్నిచోట్ల టార్చ్లైట్లు, సెల్ఫోన్ ఫ్లాష్ల వెలుగులోనే వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు.

Current Cut
కనీస సౌకర్యాలు నిల్
విద్యుత్ సమస్యతో పాటు ఆస్పత్రిలో మంచినీటి కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. నీటి సరఫరా లేక స్ట్రెచర్లపై (Stretcher) టబ్బులు పెట్టి నీటిని తరలిస్తున్న దృశ్యాలు అక్కడి దుస్థితికి అద్దం పడుతున్నాయి. మరోవైపు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర రాజధానిలోని ప్రధాన జిల్లా దవాఖానలో కనీస సౌకర్యాలు లేకపోవడం శోచనీయమని రోగులు, సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన దవాఖాన తీరును పట్టించుకోని అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం, జనరేటర్ మరమ్మతులు చేపట్టడం, రోగులకు అవసరమైన మందులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Water Problem