Agadha Movie | అగ్ర నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఎం.ఎస్.రాజు తాజాగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన తాజా మిస్టిక్ హారర్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.
కథ
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మహాదేవి (కామాక్షి భాస్కర్ల) తన బాబాయ్ (భానుచందర్) కుటుంబంతో కలిసి పెరుగుతుంది. చిన్నతనంలోనే ఓ దైవిక శక్తి పరిచయం కావడంతో ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తుంది. ఆ తర్వాత ఓ సాధువు వద్ద యంత్ర, తంత్ర విద్యలు నేర్చుకుని, ప్రజలను అతీత శక్తుల బారి నుంచి కాపాడే రక్షకురాలిగా మారుతుంది. అయితే మహాదేవి బాబాయ్ కూతురు గర్భంతో ఉండగా ఆత్మహత్య చేసుకోవడం, ఆ వెంటనే మరికొన్ని వింత మరణాలు చోటు చేసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి స్వగ్రామానికి వెళ్లిన మహాదేవికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ‘అగధ’ అనే అతీత శక్తి అసలు ఎవరు? మహాదేవి కుటుంబాన్నే ఆ శక్తి ఎందుకు టార్గెట్ చేసింది? చివరికి ఈ దైవిక, చీకటి శక్తుల పోరాటంలో ఎవరు గెలిచారనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
టాలీవుడ్లో ఆత్మలు, దైవిక శక్తుల నేపధ్యంలో వచ్చే చిత్రాలు కొత్తేమీ కానప్పటికీ, కేవలం థ్రిల్ మరియు భయాన్ని పంచడమే లక్ష్యంగా ఎం.ఎస్.రాజు ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లడంలో దర్శకుడు సఫలమయ్యారు. మహాదేవి పాత్ర పరిచయం, ఆమె నేర్చుకున్న తంత్ర విద్యలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ప్రేక్షకులకు మంచి షాక్ ఇస్తుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని చోట్ల కథనం నెమ్మదించడం సినిమాకు మైనస్‌గా మారింది. అయినప్పటికీ క్లైమాక్స్‌లో కాలయంత్రంతో ప్రతినాయకుడిని బంధించే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది.
నటీనటుల ప్రతిభ:
ఇప్పటివరకు చిన్న పాత్రలతో మెప్పించిన కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంతో పూర్తి స్థాయి నాయికగా తన సత్తా చాటారు. మహాదేవి పాత్రలో ఆమె అభినయం సినిమాకు ప్రధాన బలం. స్క్రీన్ అంతా తనే కనిపిస్తూ సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపించారు. మరో కీలక పాత్రలో నటించిన ఉల్కా గుప్తా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. జోవికా విజయ్‌కుమార్ పాత్రలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను నిజంగా భయపెడతాయి. శ్రవణ్‌రెడ్డి పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. భానుచందర్, షిజు, వనితా విజయ్‌కుమార్ తదితరులు తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్‌గా సినిమా హైస్టాండర్డ్స్‌లో ఉంది. రాకేశ్ వెంకటాపురం అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని హారర్ మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అడవి నేపథ్యంలో వచ్చే సీన్లలో ఆయన మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడిగా ఎం.ఎస్.రాజు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే విషయంలో మరికొంత కసరత్తు చేసి ఉంటే సినిమా స్థాయి మరింత మెరుగ్గా ఉండేది.