ఓదెల, ఆగస్టు 14: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని స్మశాన వాటికలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మెరుగు భీష్మాచారి మాట్లాడుతూ చెట్లు విరివిగా ఉంటేనే స్వచ్ఛమైన గాలితో పాటు ఆశించిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. సదాశయ ఫౌండేషన్ ద్వారా శరీర, అవయవ దానాల అవగాహనతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కనికి రెడ్డి సతీష్ మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్ర, అవయవ, శరీర దానాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చెట్లు నాటడం, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, విస్తర్లు నివారణ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడకూడదని సమాజహిత కార్యక్రమాలు చేస్తూ ఓదెల మండలానికి మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ వేణు, క్యాతం మల్లేశం, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.