Hushar Pittalu Review | తెలుగు తెరపై బోల్డ్ కంటెంట్ మరియు అడల్ట్ కామెడీ జోనర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆ కోవలోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. అన్ష్ మరియు వాసవి గణేషన్ జంటగా నటించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహించారు. వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతోనే సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలను పెంచేందుకు, విడుదల ముందే ‘ఏషియన్ సురేష్ ఫిలింస్’ సంస్థ ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించింది. మరి ఈ బోల్డ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
టెన్త్ క్లాస్ పూర్తి చేసి స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న రవి (అన్ష్) అదే ఊరిలో ఉండే చిట్టి (వాసవి గణేశన్)తో ప్రేమలో పడతాడు. అయితే చెడు స్నేహాలు, అడల్ట్ వీడియోల ప్రభావంతో రవి తప్పుదారి పడతాడు. తెలిసి తెలియని వయసులో హార్మోన్ల ప్రభావం వల్ల రవి, చిట్టి ఇద్దరూ హద్దులు దాటి శృంగారంలోకి అడుగుపెడతారు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. పిల్లలు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రులు పడే వేదన ఏంటి? వీళ్ల ప్రేమ సఫలమైందా లేదా? చివరికి ఈ కథ ఎలాంటి ముగింపునకు చేరిందనేదే ఈ చిత్ర అసలు కథ.
విశ్లేషణ
టీజర్ విడుదలైన సమయంలో భారీ విమర్శలను ఎదుర్కొన్న ఈ సినిమా, ట్రైలర్ విడుదలయ్యాక ఒక స్పష్టతను తెచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా పూర్తిగా అడల్ట్ కామెడీ, డబల్ మీనింగ్ డైలాగ్స్, రొమాంటిక్ సన్నివేశాలతో నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ సీన్‌తో కథలో అసలు టెన్షన్ మొదలవుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథతో పాటు ఒక బలమైన ఎమోషన్, సమాజానికి కావాల్సిన మంచి సందేశాన్ని జోడించారు దర్శకుడు. చిన్నపిల్లలపై టెక్నాలజీ, చెడు స్నేహాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశాన్ని చాలా ధైర్యంగా తెరపై ఆవిష్కరించారు. క్లైమాక్స్ రొటీన్‌గా అనిపించినప్పటికీ, ప్రస్తుత పేరెంట్స్ మరియు పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
నటీనటుల ప్రతిభ
కొత్తవారైనప్పటికీ అన్ష్ మరియు వాసవి గణేశన్ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. రొమాంటిక్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. తండ్రి పాత్రలో గోవర్ధన్ తన అనుభవంతో చక్కటి భావోద్వేగాలను పండించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంది. విజువల్స్ చాలా కలర్ఫుల్గా, రిచ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయింది. పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. విలేజ్ నేపధ్యం రియలిస్టిక్‌గా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్: 2.75 / 5