Iran Israel War | న్యూఢిల్లీ, మార్చి 5: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 23 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు కాగా, విమానయాన సంస్థలకు 100 కోట్ల డాలర్లకుపైగా (సుమారు రూ.9,165 కోట్లు) నష్టం వాటిల్లింది. భారత విమానయాన సంస్థలపై దీని ప్రభావం అధికంగానే ఉన్నది. పాసింజర్ ట్రాఫిక్ కోసం గల్ఫ్ రూట్లపై ప్రధానంగా ఆధారపడే భారత విమానయాన సంస్థలు యుద్ధ ప్రారంభ రోజుల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
మార్చి ప్రారంభం నాటికి 1,221 భారతీయ విమానాలు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దుబాయ్, అబు ధాబి, యూఏఈలోని షార్జా, జెడ్డా, రియాద్, సౌదీ అరేబియాలోని దమ్మమ్, ఒమన్‌లోని మస్కట్, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సహా ప్రధాన రూట్లలో రోజూ ప్రధాన విమానయాన సంస్థల సర్వీసుల నిలిపివేత జరిగింది. నిలిచిపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు దుబాయ్, జెడ్డా నుంచి ప్రత్యేక విమానాలను కూడా చాలా పరిమితంగా ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్నది.
దేశంలో అత్యధికంగా విమాన సర్వీసులను నడిపే ఇండిగోపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. గల్ఫ్ రూట్లలో రోజూ 65 ట్రిప్పులను ఇండిగో నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు 500కిపైగా పశ్చిమాసియా, కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. వీటిలో మార్చి 3న ఒక్కరోజే 162 విమానాలు రద్దయ్యాయి. భారత నగరాల నుంచి దోహ, దుబాయ్, అబు ధాబి వంటి నగరాలకు వెళ్లే ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన యావత్ గల్ఫ్ రూట్లయిన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సహా అంతర్జాతీయ సర్వీసులను మార్చి 1 వరకు రద్దు చేసింది. స్పైస్ జెట్ తన యూఏఈ, ఇతర గల్ఫ్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది.
అంతర్జాతీయ ఆపరేటర్ల విషయానికి వస్తే పశ్చిమాసియాలో నిర్వహించే 36,000 షెడ్యూల్డ్ విమానాలలో సగానికిపైగా రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో రెవెన్యూ నష్టం 260 కోట్ల డాలర్లు(రూ. 23,830 కోట్లు) ఉంటుందని సిరియం అనలిటిక్స్ అంచనా. గగనతల మూసివేతలు లేదా ఆంక్షలు ప్రధానంగా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్‌ను ప్రభావితం చేశాయి. బహ్రెయిన్‌లో విమానాల రద్దు 97 శాతం జరిగింది. ఖతార్‌లో ఇది 86 శాతం, కువైట్‌లో 81 శాతం ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొన్ని రోజులు 81 శాతం వరకు విమానాల రద్దు జరిగింది. దుబాయ్, అబు ధాబి విమానాల రద్దుకు తీవ్రంగా ప్రభావితం కాగా సౌదీ అరేబియా, ఒమన్, సిరియా, లెబనాన్‌లో పాక్షిక ఆంక్షల విధింపు జరిగింది.
దుబాయ్ నుంచి రాకపోకలను యూఏఈకి చెందిన ఎమిరేట్స్ మార్చి 7 వరకు రద్దు చేసింది. నిలిచిపోయిన ప్రయాణికులను తీసుకువచ్చేందుకు, సరకుల రవాణా కోసం మాత్రమే పరిమితంగా కొన్ని విమానాలను నడుపుతున్నది. నిత్యం వందల సంఖ్యలో విమానాలు నడిపే ఎమిరేట్స్ ఇటీవల ఒకే రోజు 338 విమానాలను రద్దు చేసింది. ఖతార్ ఎయిర్‌లైన్స్ కూడా దోహా నుంచి తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. అబు ధాబికి చెందిన తిహాద్ ఎయిర్వేస్ కూడా మార్చి 6 వరకు తన సర్వీసులను నిలిపివేసింది. యూఏఈకి చెందిన తక్కువ చార్జీలను వసూలు చేసే ఫ్లైదుబాయ్ కూడా తన సర్వీసులను దుబాయ్, రియాద్తోసహా ఇతర గల్ఫ్ దేశాలలో నిలిపివేసింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తన అమెరికా-టెల్అవీవ్-దుబాయ్ రూట్లను రద్దు చేసింది. హాంకాంగ్ నుంచి దుబాయ్, రియాద్‌కు క్యాథే పసిఫిక్ ఎయిర్‌లైన్స్ తన సర్వీసులను మార్చి 14 వరకు రద్దు చేసింది.