సీనియర్ నటి పావలా శ్యామల(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం 1:50 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. గుంటూరు జిల్లా అమరావతిలో 1951లో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన శ్యామల.. పదవ తరగతి వరకూ చదువుకున్నారు. తదనంతరం నాటకరంగంలోకి అడుగుపెట్టి, రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పావలా’ అనే నాటకం శ్యామలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్నుంచి ఆమె పావలా శ్యామలగా ప్రాచుర్యం పొందారు.
జంధ్యాల ‘శ్రీవారి ప్రేమలేఖ’ సినిమా ఆమెకు నటిగా గుర్తింపు తెచ్చింది. చిరంజీవి ‘ఛాలెంజ్’, బాలకృష్ణ ‘బాబాయ్ అబ్బాయి’, వెంకటేశ్ ‘స్వర్ణకమలం’ ఇలా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారామె. దాదాపుగా 50కు పై చిలుకు సినిమాల్లో పావలా శ్యామల నటించారు. కృష్ణవంశీ ‘ఖడ్గం’, పూరీ జగన్నాథ్ ‘గోలీమార్’ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. గత కొన్నేళ్లుగా ఆర్థిక, ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమెకు పవన్‌కల్యాణ్, సాయిదుర్గతేజ్, దిల్‌రాజు సహా పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు.
ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో రోడ్డుపై నిస్సహాయంగా కనిపించిన పావలా శ్యామలను దిల్ రాజు ఆసుప్రతిలో చేర్పించి వైద్య సహాయం కూడా అందించారు. తదనంతరం ఆమె ఉస్మానియా హాస్పిటల్‌కి మారారు. అక్కడే తుదిశ్వాస విడిచారు. పావలా శ్యామల మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఆధ్వర్యంలో జరుగనున్నాయి.