వాషింగ్టన్ : అమెరికాలో బేబీ పౌడర్ క్యాన్సర్ కేసులను పరిష్కరించుకునేందుకు ప్రఖ్యాత బయోటెక్ దిగ్గజం ‘జాన్సన్ అండ్ జాన్సన్'(జే అండ్ జే) ముందుకు వచ్చింది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికేందుకు సుమారు 75 వేల మంది బాధితులతో రూ. 5.5 బిలియన్ డాలర్ల (రూ.52 వేల కోట్లు) భారీ మొత్తంతో ఒప్పందానికి అంగీకరించింది. అయితే ఇది అమలు కావాలంటే దాదాపు 95శాతం మంది బాధితులు ఇందుకు అంగీకరించాల్సి ఉంటుంది.
టాల్కమ్ ఆధారిత బేబీ పౌడర్ వినియోగం వల్ల అండాశయ క్యాన్సర్ బారిన పడ్డారంటూ యూఎస్ లోని వివిధ ఫెడరల్, రాష్ట్ర కోర్టుల్లో 76 వేల కేసులు దాఖలయ్యాయి. ఈ ఉమ్మడి వ్యాజ్యాలను పరిష్కరించేందుకు సంస్థ ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయపోరాటాలకు సిద్ధ్దమయ్యామని కంపెనీ లీగల్ విభాగం ఉపాధ్యక్షుడు ఎరిక్ హాస్ తెలిపారు. 2027 నాటికి సుమారు 3 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు, మిగిలిన మొత్తాన్ని 2028లో అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.