బెంగళూరు, జూలై 28 : దేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) గణనీయంగా పడిపోవచ్చని రాయిటర్స్ పోల్లో తేలింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) భారత జీడీపీ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఈసారి మాత్రం మందగించిన పెట్టుబడులు, పెరుగుతున్న చమురు ధరలతో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలను మెజారిటీ ఎకనామిస్టులు వ్యక్తం చేయడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28) కూడా వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో ఉండదని చెప్తుండటం.. ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ఓవైపు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు క్షీణిస్తున్నాయని, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ గుర్తుచేస్తున్నారు.
దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో పెరిగే క్రూడాయిల్ రేట్లు.. ఎకానమీ వృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని చెప్తున్నారు. అదుపు తప్పుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్లో పడిపోతున్న డిమాండ్, దిగజారుతున్న వినియోగదారుల కొనుగోలు శక్తి.. అన్నీ ప్రతికూల సంకేతాలుగానే పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 6.6 శాతంగానే ఉండొచ్చని రాయిటర్స్ పోల్లో అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా 6.8 శాతంగానే ఉండొచ్చని అంటున్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం 7.7 శాతంగా ఉన్నది.