కారేపల్లి, డిసెంబర్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మాదారం వీఎస్పీ టౌన్షిప్లో గల డీఏవీ పాఠశాలలో 2001-02 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు శనివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన నాటి ఉపాధ్యాయులను మేళతాళాలు, చప్పుళ్లతో సభా స్థలానికి ఆహ్వానించారు. ఉపాధ్యాయులకు పుష్ప గుచ్చాలు అందజేస్తూ వేదికపైకి సగౌరవంగా తీసుకెళ్లారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఓకే వేదికపై చేరుకుని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్నేహితులందరూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చన్నంగల గడ్డ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బోయిన ముత్తయ్య ప్యాడ్లు, పెన్నులు, పరీక్ష సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పి.నరసింహారావు, పూర్వ విద్యార్థులు పి.రమ్య, మధులత, పద్మజ, సునీల్, రవి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

Karepally : డీఏవీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం