కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 23 : కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు భూక్య శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక వనందాస్ గడ్డలో కోతులు కుక్కల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రామవరం ప్రాంతంలో కోతులు, కుక్కలు మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని, ప్రజలు భయాందోళన చెబుతున్నట్లు తెలిపారు. కోతులు ఇండ్లలో జొరబడి ఇంట్లోని వస్తువులను కిరాణా సరుకులను చిందరవందర చేస్తూ, ఇంటిపైకి ఎక్కి రేకులు పగుల గొడుతున్నట్లు వెల్లడించారు.
గత నాలుగు రోజుల క్రితం ఒక మున్సిపల్ ఉద్యోగిపై కోతులు దాడి చేసినా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చలనం లేదని తక్షణమే అధికారులు స్పందించి వాటి నివారణ కోసం చర్యలు తీసుకుని ప్రజలను కాపాడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వనందాసుగడ్డ శాఖ సహాయ కార్యదర్శులు తోగరు నరేంద్ర కుమార్, ఎస్ కే జలీల్, సీనియర్ నాయకులు ఆది మల్లయ్య, సూరిమేని రామారావు, కడారి మల్లేష్, శంకర్, నాగోల్ మీరా, అలీం, రమేశ్, వెంకన్న, కృషీద్, పాషా పాల్గొన్నారు.