Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పింది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై చర్చ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 38 వైద్య కాలేజీలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలకు రూ.1550 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. సాలూరులో ట్రైబల్ వర్సిటీ పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. వైసీపీ చేసినట్లు మేం కూడా చేస్తే వైద్య కాలేజీలు పూర్తవ్వడానికి మరో 15 ఏళ్లు పడుతుందని అన్నారు. అందుకే వైద్య కళాశాలల విషయంలో పీపీపీ విధానంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మేం వచ్చాక కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని పేర్కొన్నారు. పీపీపీ అంటే ఏంటో తెలుసుకోవాలని సూచించారు. పీపీపీ అనేది ఆర్థిక సంస్కరణల్లో భాగమని.. అనేక రంగాల్లో పీపీపీలు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల సంపద సృష్టి జరిగిందని పేర్కొన్నారు. పీపీపీ విధానం కింద ప్రైవేటు పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేది మనందరి ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో 5.37 కోట్ల మంది జనాభా ఉంటారని తెలిపారు. 2047 నాటికి చైనా జనాభా వంద కోట్లే ఉంటుందన్నారు. అదే భారత జనాభా 162 కోట్లు అవుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతుందని తెలిపారు. మన దేశం విషయానికొస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనూ జనాభా క్రమంగా తగ్గుతోందని అన్నారు. యూపీ, బిహార్ వల్లే జనాభా బ్యాలెన్స్ అవుతుందని చెప్పారు. ఏపీలో పీహెచ్‌సీల సంఖ్య.. జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. మెడికల్ ఆఫీసర్లు మనవద్దే ఎక్కువ ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.15 లక్షల మంది వైద్యులు ఉన్నారని చెప్పారు. మనదేశంలో సగటు జీవితకాలం 70 ఏళ్లుగా ఉందన్నారు. మనదేశంలో ఎంఎంఆర్ 30 ఉందని తెలిపారు. మనదేశంలో ఇమ్యూనైజేషన్ 97 శాతం సాధించామన్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు 78 శాతం సాధించామని.. త్వరలోనే వంద శాతం సాధిస్తామని వెల్లడించారు. గర్భిణుల్లో అనీమియా 32 శాతం ఉందన్నారు.
రాష్ట్రంలో 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వాటిలో 42 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. సిజేరియన్‌లో మనం నంబర్‌వన్‌గా ఉన్నామని అన్నారు. 90 శాతం సిజేరియన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ధోరణిని ప్రభుత్వం ఆమోదించబోదని స్పష్టం చేశారు. సిజేరియన్ల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులతో మాట్లాడతామని తెలిపారు. గర్భిణులకు సురక్షిత ప్రసవంపై అవగాహన కల్పించాలని, యోగా నేర్పించే పరిస్థితి తీసుకురావాలని, దీనిపై ఇప్పట్నుంచే శ్రద్ధ పెట్టేలా ఆస్పత్రుల నిర్వాహకులను పిలిచి మాట్లాడాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు సూచించారు.