న్యూఢిల్లీ: ఐఏఎఫ్ అమ్ములపొదిలో ఉన్న 35 తేజస్ యుద్ధ విమానాలను నిలిపివేసి నిర్వహణ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 7న ప్రమాదం తర్వాత ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ భాగంలో ఉన్న ఓ ఫార్వర్డ్ బేస్ నుంచి తేజస్ విమానం టేకాఫ్ అవుతుండగా రన్వే నుంచి పక్కకు జారింది. పక్కనే ఉన్న మట్టి గుంటలోకి తేజస్ జారిపోయినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి కారణం నిర్ధారించనప్పటికీ ఐఏఎఫ్ మాత్రం మొత్తం విమానాల సమగ్ర తనిఖీలకు ఆదేశించింది.
ప్రధానంగా చక్రాలను పట్టుకునే అండర్ క్యారేజ్కి చెందిన మెటలర్జీని, అలాగే ఎలక్ట్రోమేగ్నటిక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆన్బోర్డ్ సాఫ్వేర్ను తనిఖీ చేయాలని ఐఏఎఫ్ ఆదేశించింది. తేజస్ ప్రమాదానికి లోనైనట్లు వచ్చిన వార్తలపై ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఖండించింది. అటువంటి ప్రమాదమేదీ జరుగలేదని సోమవారం స్పష్టం చేసింది.