రాంచీ, ఫిబ్రవరి 23: రోగిని ఢిల్లీకి తీసుకుని వెళ్తున్న ఒక మెడికల్ చార్టర్డ్ విమానం జార్ఖండ్‌లో సోమవారం రాత్రి కుప్పకూలింది. రాంచీ నుంచి బయలుదేరిన ఈ విమానంలో ఒక రోగి, డాక్టర్ సహా ఏడుగురు ఉన్నారు. వీరందరూ మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఢిల్లీకి చెందిన రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించే ఈ బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ బీఈ9ఎల్ విమానం రాంచీ నుంచి రాత్రి 7.07 గంటలకు బయలుదేరినట్టు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో రాత్రి 10 గంటలకు ల్యాండ్ కావాల్సిన ఈ ఎయిర్ ఆంబులెన్స్ 7.34 గంటలకే ట్రాఫిక్ కంట్రోల్‌తో కమ్యూనికేషన్‌ను కోల్పోయింది. చాత్ర సమీపంలో సమారియాలోని కాసియటు అడవుల్లో విమానం కూలినట్టు అధికారులు గుర్తించారు. విమానంలో ఒక రోగి, డాక్టర్, పారామెడిక్, ఇద్దరు అటెండెంట్లు, పైలట్, కో-పైలట్ ఉన్నారు. విమాన ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.