న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్‌వో) సభ్యులకు భారీ ఉపశమనం లభించనున్నది. నిర్వహణలో లేని ఈపీఎఫ్‌వో ఖాతాల్లో ఉన్న చిన్న మొత్తాలను వాపసు చేసే పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తును పెట్టుకోవలసిన అవసరం లేదు. వరుసగా మూడేండ్లపాటు ఎటువంటి స్వీకరణలు లేదా చెల్లింపులు లేని ఖాతాను నిర్వహణలో లేని ఖాతాగా ఈపీఎఫ్‌వో పరిగణిస్తుంది. కొత్త నిర్ణయం మేరకు రూ. 1000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న నిర్వహణలో లేని ఖాతాల నుంచి పీఎఫ్‌కు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బు బదిలీ జరుగుతుంది.
ఈ ప్రక్రియను చేపట్టేందుకు లబ్ధిదారులు ఎటువంటి క్లెయిమ్ ఫారాన్ని కాని దరఖాస్తును కాని సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్యాటగిరీ కింద 7 లక్షలకు పైగా నిర్వహణలో లేని ఖాతాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆధార్ అనుసంధానం అయిన ఖాతాలకు డబ్బు వెంటనే జమ అవుతుందని, అర్హులైన మిగిలిన ఖాతాలకు దశల వారీగా డబ్బు జమ అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దేశంలో మొత్తం నిర్వహణలో లేని ఈపీఎఫ్‌వో ఖాతాలు 31.86 లక్షలు ఉండగా వీరికి సంబంధించిన మొత్తం డబ్బు రూ.10,903 కోట్లు ఉంది. రూ.1,000 లోపు పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులు 7.11 లక్షల మంది ఉండగా వీరి మొత్తం డిపాజిట్లు రూ.30.52 కోట్లు ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ ప్రయత్నం విజయవంతమైన పక్షంలో మిగిలిన 25 లక్షల నిర్వహణలోని లేని ఖాతాలకు కూడా ఈ ఆటోమేటిక్ రిఫండ్ విధానం అమలు కాగలదు. ఈ నిర్వహణలో లేని ఖాతాలు 20 ఏండ్లకు పైగా అమల్లో ఉండి గడచిన మూడేండ్లుగా క్రియాశీలకంగా లేనట్లు పరిగణించాలి. వివిధ కారణాల వల్ల పీఎఫ్ ఖాతాలు నిర్వహణలో లేకపోవడం జరుగుతుంది.