న్యూఢిల్లీ: పండుగలు, సెలవుల వేళల్లో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరుగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించడానికి కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ విషయమై సోమవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై తీసుకొనే చర్యల గురించి ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనం దృష్ట్యా టికెట్ ధరల నియంత్రణపై ఉన్నత స్థాయిలో సమీక్ష జరుపుతున్నామన్నారు.
విమానయానం ప్రస్తుతం ప్రాథమిక సేవగా మారిందని.. అయితే చార్జీలు భారీగా పెంచడం వల్ల అది సామాన్య పౌరులకు దూరం అవుతున్నదని పిటిషనర్ తెలిపారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం కిందికి విమానయానం వస్తుందని.. కాని డైనమిక్ ధరల విధానం పేరుతో ప్రయాణికుల నుంచి అదనపు మొత్తాన్ని కంపెనీలు వసూలు చేస్తున్నాయని వాదించారు. ఉచిత లగేజీ రవాణాను 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించారన్నారు.